జోగులాంబ గద్వాల : ఆరుగాలం కష్టపడి అప్పు చేసి పండించిన పంట రైతు కండ్లముందే కాలిపోయింది. పంట చేతికొస్తే కష్టాలు తీరుతాయని నమ్మిన ఆ రైతు కంట్లో చివరికి కన్నీరే మిగిలింది. గుర్తు తెలియని దండగుల దుశ్చర్యతో రైతు కుటుంబం భోరున విలపించింది. దుండగులు నిప్పు పెట్టడంతో 10 క్వింటాళ్ల మిర్చి అగ్నికి(Chillies burnt) ఆహుతయ్యింది. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని (Jogulamba Gadwala)అయిజ మండలం తొత్తినోని దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బార్కి భీమన్న మిర్చి పంటను మార్కెట్‌కు తీసుకువెళ్లేందుకు వ్యవసాయ బావి వద్ద బస్తాల్లో నింపారు. ఇదే సమయంలో భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి గంట తరువాత వచ్చి చూస్తే బస్తాలకు నిప్పంటుకుని మండుతున్నాయి. వెంటనే మంటలను ఆర్పగా 10 క్వింటాళ్ల వరకు కాలిపోయినట్లు రైతు తెలిపారు. ఈ సంఘటనపై అయిజ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు రైతు భీమన్న తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.