హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనం చిక్కగా పరుచుకుంటున్నది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నది. హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆరేండ్ల వ్యవధిలోనే 8.2 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది. విభజన సమయానికి రాష్ట్ర భూభాగ విస్తీర్ణం 112.08 లక్షల హెక్టార్లు ఉన్నది. దీనిలో అటవీ విస్తీర్ణం 18.4 శాతం మాత్రమే. వాస్తవానికి ఇది 33.33 శాతం ఉండాలి. దీనిని గమనించిన సీఎం కేసీఆర్ 2015లో తెలంగాణకు హరితహారం అనే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆరువిడతల్లో ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయంతో రూ.6,556 కోట్ల వ్యయంతో 239 కోట్ల మొక్కలను పెంచారు. ఆరేండ్లలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం ద్వారా 1.85 లక్షల ఎకరాల్లో పచ్చదనం పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర అటవీ విస్తీర్ణం 26.6 శాతంగా ఉంది. 20,242 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉన్నది. అడవుల పునరుద్ధరణ కార్యక్రమం కింద చేపట్టిన మొక్కల పెంపకంతో సుమారు 10.34 లక్షల ఎకరాల్లో 0.1 నుంచి 0.4 శాతానికి చెట్ల చిక్కదనం పెరిగింది.
హరితహారంతోపాటు అటవీశాఖ అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతున్నది. 2021-22 నాటికి 20.20 లక్షల ఎకరాల్లో అటవీ పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించింది. 2020-21లో 10.34 లక్షల ఎకరాలు పునరుద్ధరించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 28,437 ఎకరాల్లో అటవీ పునరుద్ధరణ పూర్తి చేసింది. మరో 9.57 ఎకరాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అటవీ పునరుద్ధరణ ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 0.1 నుంచి 0.4 శాతం పెరిగింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 2.14 లక్షల ఎకరాల్లో అటవీ పునరుద్ధరణ జరిగింది. నాగర్కర్నూల్లో 1.22 లక్షల ఎకరాలు, ములుగు 1.35 లక్షల ఎకరాలు, రాజన్న సిరిసిల్ల 32,664 ఎకరాలు, మెదక్ 65,543 ఎకరాలు, కుమ్రంభీ ఆసిఫాబాద్లో 37,958 ఎకరాలు, మంచిర్యాలలో 43,471 ఎకరాలు, నిర్మల్లో 36,364 ఎకరాలు, నిజామాబాద్లో 50,845 ఎకరాలు, కామారెడ్డి 42,315 ఎకరాల అటవీ పునరుద్ధరణ జరిగింది.
హరితహారంలో భాగంగా చేపట్టిన అర్బన్ ఫారెస్టులు పట్టణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. 140 పట్టణా ల్లో అర్బన్ ఫారెస్టులను మియావాకీ పద్ధతిలో ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందించిన అటవీశాఖ ఇప్పటికే 59 పట్టణాల్లో ప్రారంభించింది. 30,663.81 ఎకరాల్లో రూ.328.61 కోట్ల అంచనా వ్యయంతో వీటిని రూపొందించింది. ఇప్పటికే 24,098.17 ఎకరాల్లో రూ.252.42 కోట్లతో 59 అర్బన్ పార్కులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.