హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న వలస కార్మికుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుత యుద్ధ సమయంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. బడ్జెట్లో వారి సంక్షేమానికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం లక్షలాది గల్ఫ్ కార్మికుల కుటుంబాలను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. రాష్ట్రం నుంచి సుమారు 15లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నట్టు అంచనా. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్సహా ఉత్తర తెలంగాణకు చెందినవారే అధికంగా ఉన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని డిసెంబర్లో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. గల్ఫ్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని వారు కోరారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. కానీ ప్రభుత్వం వారి మాటను బడ్జెట్లో ఉచ్చరించకపోవడం నిరాశకు గురిచేసింది.
ఈసారైనా యువవికాసం దక్కేనా! ; నిరుడు 6వేల కోట్ల కేటాయింపు పైసా విడుదల చేయని సర్కార్
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువవికాసం పథకం కింద రాష్ట్ర బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించినప్పటికీ, ఈసారైనా నిధులు విడుదల చేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత బడ్జెట్లో కూడా రూ.ఆరువేల కోట్లు కేటాయించడమే కాకుండా, దరఖాస్తులు కూడా స్వీకరించినా ఇప్పటికీ ఒక్కరికీ రుణం మంజూరు చేయలేదు. తాజాగా మరోసారి ఈ పథకం కోసం అంతే మొత్తంలో నిధులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 16,23,643 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. నిధుల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తాజాగా 2026-27 బడ్జెట్లోనూ మరోసారి రాజీవ్వికాసం పథకానికి రూ.6వేల కోట్లు ప్రతిపాదించింది. దీంతో ఈసారైనా నిధులను విడుదల చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.