Wildfires | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గడచిన ‘అడవుల్లో అగ్నిప్రమాదాల సంవత్సరం’(2024 నవంబర్-2025 మార్చి)లో 1.39 లక్షల ఎకరాల అడవి ప్రకృతి వైపరీత్యాలు, మానవతప్పిదాలతో దగ్ధమైందని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఐదేండ్ల వివరాలతో శుక్రవారం నివేదికను విడుదల చేసింది. సాధారణంగా వర్షాభావ పరిస్థితులు ఎక్కువ కాలం ఉండటం, కరువు పరిస్థితులు, రుతుపవనాల రాకలో ఆలస్యంతో అధిక ఉష్ణోగ్రతలు నమోవుతాయి.
వేగంగా వీచే గాలులతో చిన్న అగ్నిప్రమాదాలు జరిగి, కార్చిచ్చుగా మారుతాయి. అలాగే అడవి మార్గంలో వెళ్లే మనుషుల నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అడవుల్లో మంటలు విస్తరించకుండా 21,739 కిలోమీటర్ల ఫైర్లైన్లు, 11 కిలో మీటర్ల మేర కంకర తవ్వకం,73 వాచ్టవర్లు, 23 తక్షణ స్పందన బృందాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టినట్టు అటవీశాఖ నివేదికలో తెలిపింది. అడవుల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.