హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణం చేపట్టిన తర్వాత వివిధ కారణాలతో బిల్లులు ఆగిపోయిన ఎల్-3 క్యాటగిరీ లబ్ధిదారులకు రూ.12.17 కోట్లు విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు. జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక అనంతరం.. అర్హులైన 1072మంది లబ్ధిదారులకు ఈ నిధులను విడుదల చేశామని చెప్పారు.
అలంపూర్, జనవరి 12 : ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అధికారుల కండ్లుగప్పి మక్కల లోడ్ లారీతో డ్రైవర్ పరారైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. గత డిసెంబర్ 21న అలంపూర్‌లోని కొనుగోలు కేంద్రం వద్ద మక్కజొన్న కాంటా వేసిన అనంతరం బస్తాలను గోదాంకు తరలించేందుకు మూడు లారీల్లో లోడ్ చేశారు.
ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీ నుంచి వచ్చిన రెండు లారీలతోపాటు మరో గుర్తుతెలియని లారీ రావడంతో ట్రాన్స్‌పోర్టు నుంచే మూడు వచ్చాయని భావించిన అధికారులు మక్కలు లోడ్ చేసి పంపారు. రెండు లారీలు అలంపూరు చౌరస్తాలోని వీకేర్ గోదాంకు చేరుకోగా.. మరో లారీలోని మక్కలతో డ్రైవర్ ఉడాయించాడు. 655 బస్తాలు (30 టన్నుల మక్కలు) ఉండగా.. వీటి విలువ రూ.8 లక్షల విలువ ఉంటుందని తెలిసింది.