ఎన్నికలకు ముందు ఉద్యోగులకు హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గద్దెనెక్కిన వెంటనే ప్రతినెలా ఫస్ట్ తారీఖునే వేతనాలిస్తామని చెప్పిన హస్తం పార్టీ… ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీచర్స్ డే వచ్చినా ఉస్మానియా, కాకతీయతో పాటు పలు యూనివర్సిటీల్లోని అధ్యాపకులు, నాన్‌టీచింగ్ స్టాఫ్, పెన్షనర్లు వేతనాల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. మాడల్ స్కూళ్లల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వేతన నిరీక్షణ తప్పడంలేదు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ కాంగ్రెస్ గొప్పలు చెప్పిందని, ఇప్పుడు పట్టించుకోవడమే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒకటో తారీఖున వేతనాలను రెండు నెలలు జమచేసి మురిపించిందని, ఇప్పుడు జీతం ఎప్పుడు పడుతుందో అర్థంకావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు ఐదో తేదీ వచ్చినా వేతనజీవులపై దయచూపడంలేదని ఉద్యోగ, అధ్యాపక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. హామీ ఇవ్వడం.. ఆపై విస్మరించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సాకులు వెతుకుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశ్వవిద్యాలయంలో 350 మందికిపైగా రెగ్యులర్ ప్రొఫెసర్లు, 1100 మందికిపైగా పార్ట్‌టైమ్ అధ్యాపకులు, 1200 మంది నాన్‌టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరితోపాటు 1500 మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ ఐదో తేదీ వచ్చినా జీతాలు అందకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల బ్లాక్ గ్రాంట్ విడుదల చేయకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో సోమవారం వరకు ఎదురుచూడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. వేతనాలు లేకుండానే శుక్రవారం టీచర్స్‌డే నిర్వహించుకోవాల్సి రావడం బాధాకరమని చెప్తున్నారు. సుమారు పదిరోజులు గడిచినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లోని ఫ్యాకల్టీకి కూడా ఇప్పటివరకు వేతనాలు అందలేదని చెప్తున్నారు.
ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. హాజరైన విద్యార్థులు, అధ్యాపకుల ముందు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ వెయ్యికోట్లేమోగాని వేతనాలివ్వడంలో విఫలమయ్యారని అధ్యాపక, నాన్‌టీచింగ్ యూనియన్ల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆచరణ సాధ్యంకాని మాటలు చెప్పడం.. ఆ తర్వాత మర్చిపోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వెయ్యి కోట్ల మాటలు కట్టిపెట్టి.. ఖాతాల్లో జీతాలు జమ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ప్రతినెలా ఫస్ట్ తేదీన జీతాలివ్వాలని కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 మాడల్ స్కూళ్లల్లో పనిచేస్తున్న టీచర్లకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని పీఎంటీఏటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు టీ జగదీశ్ తెలిపారు. ఒక్కో ఉపాధ్యాయుడికి కనీసం రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉన్నదని చెప్పారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అదనపు బడ్జెట్ కోసం పెట్టిన ఫైల్ ఇప్పటివరకు క్లియర్ కాలేదని వాపోతున్నారు. 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, సెకండ్ ఫేస్‌లో నియాకమైన ఉపాధ్యాయకులకు నోషనల్ సర్వీస్ కల్పించి వేతన సవరణ చేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ప్రతినెలా మొదటి తారిఖున వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1225 మంది డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ. రూ.31,040 వేతనంగా ఖరారు చేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, ఆర్థికశాఖతో సమన్వయలోపం కారణంగా అనేక జిల్లాల్లో ఏడు నెలలుగా వారికి వేతనాలు అందడంలేదు. సగం మందికి మాత్రమే నిరుడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వేతనాలు మంజూరు చేశారు. మిగతావారు విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా వేతనం అందుకోలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. నిరుడు నాలుగు, ఈ సంవత్సరానికి సంబంధించిన మూడు నెలల వేతనాలు అందలేదని గెస్ట్ లెక్చరర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ తెలిపారు. అతిథి అధ్యాపకులకు పీరియడ్‌కు రూ. 390 చొప్పున నెలకు గరిష్టంగా 72 పీరియడ్లకు గానూ రూ. 20, 080 చెల్లిస్తున్నారు. అయితే వీరికి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి.. 2025-26కు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు నెలల వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా ఆర్థికమంత్రి వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉండడంతోనే ఈ దుస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 458 కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. కనీసం దసరా నాటికైనా వేతనాలివ్వాలని కాంట్రాక్ట్ లెక్చర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వైకుంఠం, మధుసూదన్ డిమాండ్ చేశారు.
వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ టీచర్లు, నాన్‌టీచింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దినదిన గండంగా కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించలేక సతమమతమవుతున్నాని వాపోతున్నారు. నెలవారీగా మెడిసిన్ కొనుక్కునేందుకు కూడా అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమానికి సిద్ధంకావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కాంట్రాక్ట్ టీచర్లను ఏటా ఏప్రిల్ 23న ఉద్యోగం నుంచి తొలగించి, తిరిగి జూన్ 12 నుంచి విధుల్లోకి తీసుకుంటున్నారు. జూన్ 12న సూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి కాంట్రాక్ట్ టీచర్ల సేవలను విద్యాశాఖ వినియోగించుకుంటున్నది. కానీ జూన్ 12 నుంచి వీరిని కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులివ్వలేదు. టీచర్లంతా విధులకు హాజరవుతున్నారు. బడుల్లో పాఠాలు చెప్తున్నారు. కానీ వేతనాలు మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలాయి. ఉద్యోగం కోసం ఏండ్లకేండ్లు నిరీక్షించినట్టే.. ఇప్పుడు జీతాల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి రావడం పట్ల కాంట్రాక్ట్ టీచర్లు కుమిలిపోతున్నారు.
పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న డీఎస్సీ 2008 కాంట్రాక్ట్ టీచర్లు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలైనా వీరిని కొనసాగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులివ్వలేదు. దీంతో వారికి వేతనాలు అందడంలేదు. ప్రభుత్వం ఇప్పటికే వారికి సంబంధించి 2026 మార్చి వరకు జీతాల నిధులను ట్రెజరీలకు విడుదల చేసింది. అయితే కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఆ నిధులన్నీ ట్రెజరీలో ములుగుతున్నాయి.