రంగారెడ్డి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అధికార ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బాలిక చేయి పట్టుకొన్న ఎమ్మెల్యే ఆమెను అనుచితంగా తాకడానికి ప్రయత్నిస్తున్న వీడియో సామాజిక మాధ్యమా ల్లో వైరల్గా మారింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగా ఉపయోగపడుతున్నదో తెలుసుకునేందుకు ఆర్టీ సీ బస్సెక్కారు.
బస్సులో ఓ విద్యార్థినితో మాట్లాడుతూ.. ఉచితబస్సు పథకం ఉపయోగాలు చెప్పాలని అడిగారు. ఏడాదికి రూ.45 వేల వర కు ప్రయాణ ఖర్చు మిగులుతున్నదని ఓ విద్యార్థిని సంతోషంగా వివరించింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఓవైపు విద్యార్థినితో సంభాషణ కొనసాగిస్తున్న ఎమ్మెల్యే మరోవైపు ఇంకో అమ్మాయి చేయిని పలుమార్లు పట్టుకోవడం, నడుమును తాకడం వీడియోలో కనిపించింది. ఎమ్మెల్యే స్పర్శతో అసౌకర్యానికి గురైన ఆమె తన చేయిని వెనుకకు తీసుకునేందుకు, పకకు తప్పుకునేందుకు పలుమార్లు ప్రయత్నించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన బీఆర్ఎస్.. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన మల్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ‘షీ టీమ్లు ఎక్కడున్నాయి? అని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్పీ ఎక్స్ వేదికగా డీజీపీని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మ హిళా కమిషన్ చైర్మన్ శారద ఎక్కడున్నారు? మల్రెడ్డిని ప్రశ్నించరా ? అని నిలదీశారు.
ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు చేతులు దూరంగా ఉంచాలనే ప్రాథమిక సంస్కారాన్ని కాంగ్రెస్ అధిష్టానం తన నాయకులకు నేర్పించాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘సంభాషణలో పస లేనప్పు డు అంతలా పదేపదే తాకాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎమ్మెల్యే వయసుతో ఇక్కడ పనిలేదు.
ఆ యువతి అసౌకర్యంగా ఫీలవుతుందనే విష యం ఆ వీడియో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. పదేపదే ఒంటిపై చేతులు వేయడం, నడుము భాగంలో తాకడం ఏంది? తమ మనవరాలి వయసున్న పిల్ల కనిపించినా కూడా అసభ్యంగా తాకే అవకాశాన్ని నాయకులు ఏ మాత్రం వదులుకోరు’ అంటూ చిన్నయి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.