హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల, పెన్షనర్లకు ప్రభు త్వం రెండు డీఏలు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పెరిగిన డీఏను అక్టోబర్ జీతంలో కలిపి నవంబర్ 1న చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిం ది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు అడియాసలయ్యాయి. దసరాకు అందుతాయనుకున్న డీఏలు, దీపావళికి అందనున్నాయి. ఈ రెండు డీఏలతో ఉద్యోగులకు అందే కరువు భత్యం 40.04 శాతానికి చేరింది.
వాస్తవానికి ఈ రెండు డీఏ ల్లో ఒకదాన్ని 2024 జనవరి 1న, రెండోదాన్ని 2024 జూలై 1న చెల్లించాల్సి ఉన్నది. ఎట్టకేలకు అవి ఇప్పుడు క్లియర్ అయ్యాయి. వీటిలో 2024 జనవరి డీఏ కి సంబంధించిన 33 నెలల బకాయిలను 33 సమాన వాయిదాల్లో, 2024 జూలై డీఏకి సంబంధించిన 27 నెలల బకాయిలను 27 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
కాగా ప్రభుత్వం.. మరో నాలుగు డీఏలు బాకీపడింది. 2025 జనవరి 1, జూలై 1, 2026 జనవరి 1, జూలై 1 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే 2026 జూలై 1 డీఏ తప్ప మిగిలిన డీఏలను ప్రకటించింది. రాష్ట్రంలోని ఓపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలన్నీ జీపీఎఫ్‌లో ఖాతాలో జమ అవుతాయి.
కానీ, సీపీఎస్ ఉద్యోగులకు అందాల్సిన డీఏ బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు విడుద ల చేయకుండా పెండింగ్‌లో పెట్టి తర్వాత కాలంలో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నా రు. 6 డీఏలకు సంబంధించిన 103 నెలల బకాయిలు ఉద్యోగులకు అందాల్సి ఉన్నది. వీటికి అదనంగా ఇప్పుడు మరో 2 డీఏలకు సంబంధించిన 60 ఇన్స్టాల్మెంట్లు చేరాయి.