వికారాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా పేరు మారిస్తే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ వికారాబాద్ జిల్లాను ఏర్పాటుచేసి 40 ఏండ్ల చిరకాల కోరికను నెరవేర్చారని తెలిపారు. మళ్లీ జిల్లాల పునర్విభజన చేపడితే బీఆర్ఎస్ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నదని.. దీనిపై ఉద్యోగులు, జేఏసీ ఆధ్వర్యంలో చర్చ పెట్టాలని సూచించారు. గతంలో కేసీఆర్ జోనల్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకువచ్చి హైదరాబాద్ ఫ్రీ జోన్ లేకుండా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ సర్కార్ మళ్లీ వాటిని మార్పు చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు.
మహబూబాబాద్ రూరల్, జనవరి 13 : ఎవరైనా సరే.. మానుకోట జిల్లాను ముట్టుకుంటే మాడిమసైపోతారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ హెచ్చరించారు. మంగళవా రం మహబూబాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు మహబూబాబాద్ జిల్లాను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ పేరుతో ఉన్న జిల్లాలను తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు.