హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాహుల్‌గాంధీకి డబ్బులు పంపడంలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 18నెలలు గడిచినా.. ఎన్నికల హామీల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రజల చెవిలో పువ్వులు పెడుతూనే ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 12763 సర్పంచులు, 5717 మంది ఎంపీటీసీలు, 538 జడ్పీటీసీలు ఉన్నారని, వారి పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానికసంస్థల ఎన్నికల ఆలస్యంతో పల్లెలకు తీవ్ర నష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్థానిక సంస్థలకు వచ్చే రూ.1514 కోట్ల నిధులను రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే ప్రభుత్వం స్థానికసంస్థలకు ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్‌చేశారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటే కులగణన సర్వే వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.