హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలకు గ్రేడింగ్ ఇవ్వాలని ఉన్నత విద్యామండలి అధికారులు యోచిస్తున్నారు. న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రస్థాయిలో గ్రేడ్లు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ అంశంపై ఇటీవలే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సమీక్షించారు.
స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ద్వారా గ్రేడింగ్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉన్నత విద్యాసంస్థలకు జాతీయ స్థాయిలో న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ల ద్వారా గ్రేడింగ్ జారీచేస్తున్నారు. ల్యాబ్లు, వసతులు, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడింగ్ ఇస్తున్నారు. వీటి ఆధారంగానే కాలేజీలకు అటానమస్ హోదా, కోర్సుల మంజూరు సహా ఇతరత్రా అంశాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ గ్రేడింగ్స్ ఇవ్వడం ద్వారా అత్యున్నత ప్రమాణాలు ఉన్న విద్యాసంస్థలకు తగు గుర్తింపునిచ్చినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు.