హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకంలో లబ్ధిదారులు ఎక్కువగా రవాణా వాహనాలవైపే మొగ్గుచూపుతున్నారు. అధికారుల బృందాలు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో చేసిన ఇంటింటి సర్వేలో పలు అంశాలు సేకరించాయి. మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి ఐదు ప్రాధాన్యాంశాల డాటాను ఒకచోటకు చేర్చింది. వీరిలో ఎక్కువ మంది రవాణావాహనాల వైపు ఆసక్తి చూపించగా ట్రాక్టర్, ట్రాలీలను ఎంచుకొన్న వారు రెండోస్థానంలో ఉన్నారు. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో నమోదైన దళిత కుటుంబాలు 20,929 కాగా, ప్రస్తుతం 639 కుటుంబాలు అదనంగా పెరిగి మొత్తం 21,568కి చేరుకొన్నాయి. దళితబంధు కింద చేపట్టే వ్యాపార యూనిట్లలో 4,339 కుటుంబాలు (20%) ఫోర్ వీలర్ల (ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు) వైపు ఆసక్తి ప్రదర్శించారు. 4,145 కుటుంబాలు (19%) ట్రాక్టర్ ట్రాలీలు కొంటామని వెల్లడించారు. ఇతరులు మినీ డెయిరీ, మినీ సూపర్‌బజార్‌ను చేపడతామని పేర్కొన్నారు.
ప్రాధాన్యాంశాల ఎంపికపై కసరత్తు
దళితబంధు పథకంలో కీలకమైన అంకం ప్రస్తుతం హుజూరాబాద్‌లో కొనసాగుతున్నది. లబ్ధిదారులు చేపట్టే యూనిట్లను ప్రాధాన్యాంశాల ప్రాతిపదికన అధికారులు గుర్తించారు. వీటిపై ఆయా ప్రాంతాల్లో నెలకొన్న మార్కెట్ పరిస్థితులను అధ్యయనంచేసి లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపార యూనిట్ భవిష్యత్‌పై వారికి అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ, పశు సంవర్ధక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి, పరిశ్రమల శాఖల అధికారుల బృందం ఈ పనిలో నిమగ్నమైఉన్నది. ఒకే గ్రామంలో నలుగురైదుగురు ఒకే యూనిట్‌ను ఎంపిక చేసుకొంటే వాటి ఫలితాలను వివరించి, విశ్లేషించి ఆయా యూనిట్లను గ్రౌండింగ్చేసే పనిలో తలమునకలయ్యారు. లబ్ధిదారుల కుటుంబాలు ఎంపిక చేసుకున్న ప్రాధాన్యాంశాల్లో తొలి ప్రాధాన్యంగా ఎలక్ట్రికల్ స్టోర్స్, బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీసెస్‌ను చేపడతామని చెప్పిన కుటుంబాల సంఖ్య 263. డయాగ్నస్టిక్స్, మెడికల్ ల్యాబ్ విత్ మెడికల్ షాప్స్ చేపడతామని చెప్పిన కుటుంబాలు 118.. ఆగ్రో మెకానిక్ షెడ్స్‌లో తమకు అనుభవమున్నదని చెప్పిన కుటుంబాలు 59.. మినీడెయిరీల నుంచి నైపుణ్యం కలిగిన వ్యాపారాలు సైతం చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని దళిత కుటుంబాలు పేర్కొనటం ఈ పథకం విజయానికి తొలిమెట్టుగా అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఆషామాషీ ఖాతా కాదిది…
దళితబంధు లబ్ధిదారులకు మిగతా బ్యాంకు ఖాతాలకంటే ఈ ఖాతా ప్రత్యేకంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించటంతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ నియోజకర్గంలోని అన్ని దళితకుటుంబాల పేరిట తెలంగాణ దళితబంధు పథకం కింద ప్రత్యేక ఖాతాలను తెరిపించారు. ఈ బ్యాంకు ఖాతాలో కనీస నగదు నిల్వను నిర్వహించాల్సిన అవసరం లేదు. ఈ ఖాతాలో ప్రభు త్వం జమచేసిన రూ. 10 లక్షల నగదును ఎప్పుడు పడితే అప్పు డు లబ్ధిదారుడు విత్‌డ్రా చేయకుండా ప్రత్యేక ఏర్పాటుచేశారు. లబ్ధిదారుని యూనిట్ ఎంపిక అయ్యాక, దశలవారీగా సదరు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలును కల్పించారు. అదీ జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపితేనే ఆ సొమ్ము సదరు పెట్టుబడికి ఉపయోగపడేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, చెక్‌బుక్, ఏటీఎం కార్డు సౌకర్యాన్ని ఈ ఖాతాకు వర్తించేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. ఈ ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉద్దేశం, నిర్వహణ వంటి అన్ని అంశాలను లబ్ధిదారులకు అర్థమయ్యేలా చెప్పి వారి ఆమోదంతోనే ఈ ఖాతాలు తెరిచారు.
సుదీర్ఘ కసరత్తు
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రాథమిక డాటా ఆధారంగా పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల బృందాలు ఐదు మండలాలు (హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట), జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో 41 బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే చేశారు. ప్రతి బృందంలో ఒక బ్యాంకు అధికారి ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సర్వే సందర్భంగా ప్రతి దళిత కుటుంబం దళితబంధు పథకంలో చేపట్టే అంశాలపై సర్వే చేశారు. ప్రాధాన్యక్రమంలో ఐదు అంశాలపై మరోసారి సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం ఐదు ప్రాధాన్య అంశాలను ఒకచోట చేర్చి సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. లబ్ధిదారుల ఇష్టాయిష్టాలను బట్టి చేపట్టే యూనిట్ల ఎంపికను ఖరారు చేస్తున్నారు.