హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ రణరంగంగా మారింది. నేతల అరుపులు, నినాదాలు, ధర్నాలతో రచ్చ రచ్చ అయింది. నేతల మధ్య మాట మాట పెరిగి చేతల వరకు వెళ్లింది. అధిష్ఠానం దూత, సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ సమక్షంలోనే పలువురు నేతలు కొట్టుకోవడం గమనార్హం. గల్లాలు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అనిల్‌పై ఓయూ నేతలు దాడికి యత్నించారు. మహబూబాబాద్ జిల్లా నేతలు పరస్పరం కొట్టుకున్నారు. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్ఠానం దూత దిగ్విజయ్‌సింగ్ బుధవారం నగరానికి వచ్చారు. గురువారం గాంధీభవన్‌లో ఇరువర్గాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా ఒకేసారి గాంధీభవన్‌కు చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గాంధీభవన్‌లో రోజంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
రేవంతే సమస్య…
దిగ్విజయ్‌సింగ్‌తో భేటీలో సీనియర్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపైనే ప్రధానంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తమకు పార్టీలో రేవంత్‌రెడ్డే అతిపెద్ద సమస్య అని, ఆయన ఒంటెద్దు పోకడలతో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పినట్టు తెలిసింది. ఆయన నేతృత్వంలో పని చేయలేమని తేల్చిచెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఆయన సొంతమైనట్టు వ్యవహరిస్తున్నారని, ఏ కార్యక్రమంలోనూ, కమిటీల ఏర్పాటులోనూ తమ అభిప్రాయాలను తీసుకోవడం లేదని, ఇన్వాల్వ్ చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రతి అంశంలోనూ సీనియర్ నేతలను కించపరిచేలా, అవమానించేలా వ్యవహరిస్తున్నారని, తన అనుచరులతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన దిగ్విజయ్‌సింగ్..అన్నీ తాను చూసుకుంటానని, పార్టీ గెలుపు కోసం పని చేయాలని సీనియర్లకు సూచించినట్టు తెలిసింది.
మాణిక్కం ఠాగూర్ అవుట్?
పార్టీ పరంగా రేవంత్‌రెడ్డి ఆగడాలకు అండగా నిలుస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ వ్యవహారశైలిపైనా సీనియర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆయన అండతోనే రేవంత్‌రెడ్డి మరింత రెచ్చిపోతున్నారని చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో జరిగే పరిణామాలను, అసంతృప్తిని అధిష్ఠానానికి చేరకుండా ఠాగూర్ అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్‌ను తప్పించాలని సీనియర్ నేతలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఆయన్ను మారుస్తామని దిగ్విజయ్ హామీ ఇచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.