దళిత బంధుపై బండి మాటకు మంత్రి హరీశ్ రావు సూటి పోటు
సీదీ..బాత్
రైతుబంధును హుజూరాబాద్‌లో ప్రారంభించిన రోజు చప్పట్లు కొట్టి స్వాగతించిన వారు, ఈ రోజు దళితబంధును ఇదే గడ్డపై ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారు. ఓటమి భయంతో ప్రజలను రెచ్చగొడుతున్నారు.
ఏ నాయకుడైనా తన నియోజకవర్గంలోని ప్రజలకు మేలు జరుగుతుందంటే ఆహ్వానిస్తారు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారు.. కానీ, దురదృష్టమేమింటే హుజూరాబాద్‌లో మాత్రం నిరసనలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కో కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల సహాయం అందిస్తున్నది. మీకు చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 40 లక్షలను కేంద్రం నుంచి తెప్పించి ఇవ్వాలి. హుజూరాబాద్ నియోజకవర్గ దళిత బిడ్డలకు ప్రయోజనం చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 2వేల కోట్లు కేటాయించింది. అదే రీతిలో బీజేపీ నేతలు కేంద్రం నుంచి 8వేల కోట్లు తెచ్చివ్వాలి.–మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్/ హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 14: దళితబంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని చెప్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఇందుకు కేంద్రం నుంచి ఏ మేరకు సాయం ఇప్పిస్తారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సహాయం అందిస్తున్నదని, బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన రూ.40 లక్షలను కేంద్రం నుంచి తెప్పించి ఇవ్వాలని సవాల్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ దళిత బిడ్డలకు ప్రయోజనం చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించిందని, అదేరీతిలో కేంద్రం నుంచి రూ.8,000 కోట్లు మంజూరుచేయించాలని చెప్పారు. అలా తీసుకొస్తే తాము ప్రధాని నరేంద్రమోదీతోపాటు బీజేపీ నేతలదరికీ పాలాభిషేకం చేస్తామని తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద 20వేల మంది లబ్ధిదారులకు సహాయం అందించి తీరుతామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితబంధు కార్యక్రమం ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవడం ఖాయమని చెప్పారు. ఆ రోజు 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని ప్రకటించారు. తర్వాత ప్రతి గ్రామంలో ప్రత్యేకాధికారి, కోఆర్డినేటర్లు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామసభలు నిర్వహించి ప్రజల మధ్య లబ్ధిదారులను ఎంపికచేస్తారని తెలిపారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని, ఇందుకోసం వచ్చే సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించుకొంటామని తెలిపారు. ఇందులో ఫేజ్-1, ఫేజ్ -2 అనేవి ఉండవని, అర్హులందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నదని స్పష్టంచేశారు.
ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వస్తున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. పంట రుణమాఫీ గురించి మాట ఇచ్చామని, ఆ మేరకు ఇప్పటికే రూ.25 వేల వరకు మాఫీచేశామని, రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆగస్టు 15 వరకు డబ్బులు విడుదలచేసి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఎలక్షన్ నోటిఫికేన్ రాలేదు కానీ, బీజేపీ నేతలు ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితబంధు ఆపాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఉత్తరాలు రాస్తున్నారని, హైకోర్టులో కేసులు వేస్తున్నారని, ఈ వ్యవహారాలన్నింటినీ రాష్ట్రంలోని దళితజాతి గమనిస్తున్నదని పేర్కొన్నారు. ఇటువంటి కుట్రలు, కుతంత్రాల వల్ల టీఆర్ఎస్కు ఎటువంటి నష్టంలేదని స్పష్టంచేశారు. హుజూరాబాద్ దళిత బిడ్డలంతా ఆత్మ విశ్వాసంతో, ధైర్యంగా ఉండాలని కోరారు. హుజూరాబాద్ మండలం వెంకట్రావ్పల్లి దళిత బస్తీలో గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్‌తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ పథకాన్ని అమలుచేయడానికి హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇంత ఉన్నతమైన పథకాన్ని స్వాగతించి సహకరించాల్సింది పోయి.. బీజేపీ నాయకులు, కొన్ని సంఘాల వాళ్లు ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. దళితబంధు పథకం కింద అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ సాయం అందిస్తామని, ఈ విషయంలో చెప్పుడు మాటల వినవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించిన సమయంలో కూడా ఇలాగే ప్రచారం చేశారని చెప్పారు. ఇది కొంతమందికే వస్తదని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని ఇదే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనుమానాలు, అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. కరోనా, కరువు ఉన్నా రైతుబంధును మూడేండ్లుగా నిరాటంకంగా ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధును హుజూరాబాద్‌లో ప్రారంభించిన నాడు చప్పట్లు కొట్టి స్వాగతించిన వారు ఈ రోజు దళితబంధును ఇదే గడ్డపై ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని ఎద్దేవాచేశారు. హుజూరాబాద్‌లో దళితబంధు అమలుకు రూ.2 వేల కోట్లు కేటాయించారని, నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని హరీశ్‌రావు వివరించారు. దళితబంధు పథకాన్ని ఎన్నికల కోసమే ప్రారంభించారని కొంతమంది చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోయిన బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ దళిత్ ఎంపవర్మెంట్ అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నామని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదలవుతాయని చెప్పారని గుర్తుచేశారు. అప్పుడు ఏ ఎన్నికలు లేవని, దళితుల అభ్యున్నతి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ఆ రోజే స్పష్టం చేశారని చెప్పారు. ఏ నాయకుడైనా తన నియోజకవర్గంలోని ప్రజలకు మేలు జరుగుతుందంటే ఆహ్వానిస్తారని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారని, కానీ, దురదృష్టమేమిటంటే హుజూరాబాద్‌లో మాత్రం నిరసనలు చేయించే ప్రయత్నం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు బీజేపీ వాళ్లు అడ్డంకులు సృష్టించి తాత్కాలిక సంతోషం పొందినా.. భవిష్యత్‌లో ఆ కుటుంబాల చేతిలోనే మసైపోతారని హెచ్చరించారు.