సైదాబాద్, మే 11 : ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న చంపాపేట లక్ష్మిగార్డెన్లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్ది మాధవీలతకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల సభలో నవనీత్ కౌర్ రానా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘విధుల్లో ఉన్న పోలీసులు పక్కకు తప్పుకొంటే ఒవైసీ సోదరులపై చర్యలకు 15 సెకన్ల సమయం చాలు’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్ ప్లయింగ్ స్కాడ్ టీం ఇన్చార్జి రాకేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవనీత్ కౌర్ రానాపై 505(2), 506,171(సీ),171(ఎఫ్),171(జి) సహ భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సైదాబాద్ ఇన్స్పెక్టర్ కే రాఘవేందర్ తెలిపారు. కాంగ్రెస్కు ఓటువేస్తే పాకిస్తాన్కు వేసినట్టేనని వ్యాఖ్యలు చేసిన ఆమెపై ఇదివరకే షాద్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.