Barrage | జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్‌లో ఒక్క పిల్లర్ కుంగిన ఉదంతాన్ని సాకుగా తీసుకొని ‘అదిగో పులి.. ఇదిగో తోక’ అన్న చందంగా విపక్షాలు మిగిలిన బరాజ్‌లపై కూడా బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా ఉన్న వివిధ బరాజ్‌లు, పంప్‌హౌస్‌ల నిర్మాణాలను ఎల్అండ్టీ, ఆప్కాన్, మేఘా, సీ5 వంటి కంపెనీలకు అప్పగించారు.
ఆయా బరాజ్‌లను నిర్మించడంతోపాటు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఐదు నుంచి 15 ఏండ్లపాటు వాటి మెయింటెనెన్స్ బాధ్యత కూడా ఆ కంపెనీలదే. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు తమ అధీనంలోని బరాజ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిచేయడం వాటి విధి. అందులో భాగంగానే అన్నారం బరాజ్ వద్ద జరుగుతున్న మెయింటెనెన్స్ పనులను చూసి ఇక్కడ కూడా ఏదో ఘోరం జరిగిపోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వండివార్చుతున్నారు.
అన్నారం వద్ద ఏం జరిగింది?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి) బరాజ్ వద్ద అధికారులు ప్రతీ సంవత్సరం మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తుంటారు. నిర్మాణ సంస్థల నిపుణులు ఏడాదికోసారి గేట్ల వద్ద వరదలు తగ్గాక బరాజ్‌ను సంపూర్ణంగా పరిశీలిస్తారు. ఇది నిత్యం జరిగే పనే. సరస్వతి బ్యారేజీని 66 పిల్లర్లతో, 64 గేట్లతో 1.2 కిలోమీటర్ల పొడవున 10.87 టీఎంసీల సామర్థ్యంతో ఆప్కాన్ కంపెనీ నిర్మించింది. ఐదేండ్ల పాటు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఆప్కాన్ కంపెనీదే. ఎప్పటిమాదిరిగానే సరస్వతీ బరాజ్‌లో స్టోన్, మెటల్, ఇసుకతో రింగ్‌బండ్ చేపట్టి మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తుండగా బయటకు వచ్చే నీటిని చూసి బుంగ పడిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రాజెక్టులకు ఢోకా లేదు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబరాజ్, సరస్వతి బరాజ్, కన్నేపల్లి పంప్‌హౌస్‌లకు ఎలాంటి ఢోకా లేదని అధికారులు తెలిపారు. ఆయా బరాజ్‌లను నిర్మించిన వివిధ కంపెనీలకు వాటి నిర్వహణ బాధ్యత ఐదేండ్ల నుంచి 15 ఏండ్ల వరకు ఉన్నదని పేర్కొన్నారు. సరస్వతీ బరాజ్‌ను నిర్మించిన ఆప్కాన్ కంపెనీ ఐదేండ్లపాటు, లక్ష్మీబరాజ్‌ను నిర్మించిన ఎల్అండ్టీ కూడా ఐదేండ్లు వారెంటీ పీరియడ్ ఉందని తెలిపారు. ఇక కన్నెపల్లి పంప్‌హౌస్ మేఘా కంపెనీ నిర్మించగా వారికి 15 ఏండ్లు, గ్రావిటీ కెనాల్‌ను సీ5 కంపెనీ నిర్మించగా వారికి సైతం 15ఏండ్ల వారెంటీ పీరియడ్ ఉన్నదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మించే ముందు 40 ఏండ్ల వరద పరిస్థితిని అధ్యయనం చేసి డిజైన్ చేశారని అధికారులు వివరించారు. అయితే అంచనాకు మించి 2022లో కురిసిన వర్షాలతో 119.2 మీటర్ల ఎత్తుతో వరదలు వచ్చాయని, పంప్‌హౌస్‌లోకి నీరు చేరడం మినహా ప్రాజెక్టుకు ఎలాంటి హానీ జరుగలేదని అన్నారు. పంప్‌హౌస్ నీటిలో మునగగా మేఘా కంపెనీ మరమ్మతు చేపట్టి మళ్లీ రన్ చేస్తున్నదని వివరించారు.
ఎలాంటి సమస్యా లేదు
సరస్వతి బరాజ్ వద్ద ఎలాంటి సమస్యా లేదు. ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రతి సంవత్సరం మాదిరిగానే బరాజ్ వద్ద వరదలు తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ పనులు నిర్వహించడం సహజం. 2022లో వరదలు వచ్చినప్పటి నుంచి అలర్ట్‌గా ఉన్నాం. బరాజ్ వద్ద స్టోన్ డంపింగ్, మెటల్ డంపింగ్, సాండ్ బ్యాగులతో బండ్ ఏర్పాటు చేసి మెయింటెనెన్స్ పనులు కొనసాగిస్తుంటాం. ఎప్పుడూ ఇది జరిగేదే.
– యాదగిరి, నీటి పారుదల శాఖ ఈఈ (సరస్వతి బరాజ్)