హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం తనిఖీలు చేపట్టిన అధికారులు.. 17 జిల్లాల్లో 93 కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో అత్యధికంగా 31, రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 7 కేసులు నమోదు చేశామని రవాణాశాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. గురువారం రోడ్డుపై కనిపించిన ప్రతీ స్కూల్ బస్‌ను తనిఖీ చేశామని, ఆర్సీ, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ వంటి సర్టిఫికేట్లను పరిశీలించినట్టు చెప్పారు. హ్యాండ్ బ్రేక్, అగ్నిమాపక పరికరాలు, మెడికల్ కిట్లను కూడా చెక్ చేసినట్టు వెల్లడించారు.
60 ఏండ్లు పైబడిన డ్రైవర్లను నియమించుకోవద్దని పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. సుమారు 5వేలకు పైగా బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు. ఫిట్‌నెస్‌లేని బస్సులు నడుపుతున్న సూళ్ల గుర్తింపును కూడా రద్దు చేస్తామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.