కొత్తగూడెం గణేశ్టెంపుల్/ పాల్వంచ/ ఇల్లెందు/ మణుగూరుటౌన్/ బూర్గంపహాడ్, మే 6 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతను నివారించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు.ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పాల్వంచ, ఇల్లెందు, భూర్గంపహాడ్లో నిర్వహించిన ధర్నాలో సీపీఐ నేతలు ముత్యాల విశ్వనాథం, సాయిబాబా, పూర్ణచంద్రరావు, రాహుల్, విశ్వేశ్వరరావు, పద్మజ, కే సారయ్య, సరెడ్డి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 6 (2నమస్తేతెలంగాణ): గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఈనెల 10న హైదరాబాద్కు ప్రధాని మోదీ రాకను నిరసిద్దామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ తెలిపారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా బుధవారం హైదరాబాద్లో సీపీఐ శ్రేణులు భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈటీ నరసింహ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ నేతలుస్టాలిన్, యాదగిరి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఎలిమినేడు నోస్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. నోస్ ఫార్మా కంపెనీలో మే 1న పేలుడు సంభవించడంతో పలువురు గాయపడి డీఆర్డీవో అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఎమ్మెల్సీ సత్యం క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం దవాఖాన వద్ద ఆయన మాట్లాడుతూ పరిశ్రమలో రియాక్టర్లు పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయాలపాలైనా ఇప్పటికీ కార్మికశాఖ మంత్రి స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. నోస్ ఫార్మా పరిశ్రమలో కేవలం నెల రోజుల్లోనే రెండుసార్లు రియాక్టర్లు పేలడం యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరగడం, పరిశ్రమల కాలుష్యంపై పరిశ్రమల శాఖ సమగ్ర సమీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితులు కోలుకునేంతవరకు మెరుగైన వైద్యం అందించాలని డాక్లర్లను కోరారు.