న్యూఢిల్లీ, మార్చి 25: ఎల్పీజీ చార్జీలు, ఇంధన ఖర్చును రాబట్టుకోవడం పేరిట వినియోగదారులపై అదనపు చార్టీలు వడ్డించవద్దని హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) బుధవారం ఆదేశించింది. ఈ చర్యలు అక్రమ వ్యాపార విధానాల పరిధిలోకి వస్తాయని, చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీసీపీఏ హెచ్చరించింది. రెస్టారెంట్లు, హోటళ్ల మెనూలో పేర్కొన్న ధరలకు వర్తించే పన్నులను మాత్రమే కలపాలని, పెట్టుబడి ఖర్చులను మెనూలో పేర్కొన్న ధరల్లోనే చేర్చాలని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా హోటళ్లు వసూలు చేస్తున్న ధరలను పర్యవేక్షిస్తున్నామని, ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీసీపీఏ ఒక ప్రకటనలో పేర్కొన్నది.