హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఫారెస్టుట్రాక్లోని నీటి కాలువ (వాగు)ఒడ్డుకు దిగువన పాతరాతియుగం నాటి పనిముట్లను చరిత్రకారులు గుర్తించారు. క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ మీర్ ఒమర్ అలీఖాన్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో వీటి ఆనవాళ్లను గుర్తించారు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో మూడు రాతి గొడ్డళ్లు కాగా, నాలుగోది చీల్చుడు రాతి పనిముట్టు అని పేర్కొన్నారు. ఈ రాతి పనిముట్టు చేయడానికి సిద్ధపరచిన కండరాయి (కోర్ మెటీరియల్) లభించినట్టు తెలిపారు. మొదటి రాతి పనిముట్టును ధర్వాడ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కొరిసెట్టర్ గుర్తించినట్టు పేర్కొన్నారు. గతంలో ఈ మంచిరేవుల ఫారెస్టు ట్రాక్‌లోనే మధ్య రాతి యుగాల నాటి రాతి చిత్రాలు, రాతి పనిముట్లు లభించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. భావితరాలకు తెలంగాణ చారిత్రక ఆనవాళ్లను అందించాల్సిన అవసరం ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ తెలిపారు.