రెండు రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి సురేఖ ఓఎస్డీ అరెస్ట్ యత్నం ఎపిసోడ్ ఒక్కసారిగా చల్లబడింది. ఇటు సీనియర్ మంత్రి ఓఎస్డీ వ్యవహారాలపై అనుమానంతో పోలీసులను పంపిన ముఖ్యనేత, ఉన్నట్టుండి మౌనవ్రతం పట్టారు.. అటు ముఖ్యనేత, మంత్రులపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసిన మంత్రి కూతురు ఇప్పుడు చడీచప్పుడు లేదు. బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ తన కూతురు సుస్మిత ఆరోపించిన మరునాడే తమ నాయకుడు రెడ్డి అయినా బీసీల కోసం మద్దతు ఇస్తున్నారంటూ మంత్రి సురేఖ ప్రశంసలు కురిపించారు. మరి ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించడం వెనుక మతలబేమిటి? అసలేం జరిగింది?
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను అత్యవసరంగా విధుల నుంచి తొలగించి, ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏకంగా మంత్రి సురేఖ ఇంటిని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొండా కుమార్తె సుస్మిత ఏకంగా ముఖ్యనేత, పలువురు మంత్రులు, బిగ్ బ్రదర్స్, సలహాదారులు, తదితరులపై సంచలన ఆరోపణలు చేశారు. భూ దందాలు, దక్కన్ సిమెంట్స్ వ్యవహారాలు ఇలా ఎన్నో కుంభకోణాలు జరిగాయని వరుసగా బాంబులు పేల్చారు. ఈ ఘటనతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టడం, పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం వంటివి సంచలనంగా మారాయి. క్యాబినెట్ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందన్న వార్తలు వెలువడ్డాయి. తీరా అసలు విషయం ఆరా తీస్తే.. ఓఎస్డీ సుమంత్ దక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ తలకు గన్ను గురిపెట్టి బెదిరించారని తేలింది.
ముఖ్యనేత, మంత్రి మధ్య వాటాల పంపకంలో తేడాలు రావడం వల్లే ఇదంతా జరిగిందన్న ప్రచారం జరిగింది. రెండు రోజులపాటు తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ మొత్తం సైలెంట్ అయ్యింది. ఒక సీనియర్ మంత్రి ఓఎస్డీ వ్యవహారాలపై అనుమానంతో పోలీసులను పంపించిన ముఖ్యనేత మౌనం వహించారు. ముఖ్యనేతపై, మంత్రులపై తీవ్రాతి తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కూతురు ఇప్పుడు బయట కనిపించడం లేదు. అటు ఆరోపించిన వ్యక్తులు, ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, అర్ధరాత్రి ఏడుపులు పెడబొబ్బలు పెట్టినవారు, మరుసటి రోజు ప్రెస్మీట్లు పెట్టి హడావుడి చేసినవారు.. ఇలా అందరూ ఎందుకు గప్‌చుప్ అయ్యారు? బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ తన కూతురు సుస్మిత ఆరోపించిన మరునాడే తమ నాయకుడు రెడ్డి అయినా బీసీల కోసం మద్దతు ఇస్తున్నారంటూ మంత్రి సురేఖ ప్రశంసలు కురిపించడం వెనుక మతలబేమిటి? అసలేం జరిగింది?
గన్ను దొరికిందా? లేదా?
సుమంత్ కోసం మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లి ఇప్పటికి మూడు రోజులు గడిచింది. కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. కనీసం సుమంత్‌పై కేసు కూడా నమోదు కాలేదని పోలీస్ వర్గాలు తెలిపాయి. అసలు ముఖ్యనేత ఇంటివెనుక ఏం జరిగింది? కంపెనీ డైరెక్టర్‌ను రోహిన్‌రెడ్డి కార్యాలయానికి ఎవరు రమ్మన్నారు? అదే సమయంలో కొండా సురేఖ ఓఎస్డీ ఎందుకు వచ్చారు? అక్కడ వ్యాపారవేత్తను బెదిరిచేందుకు వాడిన తుపాకీకి లైసెన్స్ ఉన్నదా? లేదా? ఒకవేళ లేకుంటే ఆ గన్నును వినియోగిస్తున్నవారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? వంటివి చెప్పాల్సిన పోలీస్ యంత్రాంగం పూర్తిగా సైలెంట్ అయ్యింది. సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెడితేనే బెదిరింపులు, అరెస్టులతో హడలెత్తిస్తున్న పోలీసులు, స్వయంగా మంత్రి కొండా సురేఖ కూతురు సంచలన ఆరోపణలు చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆమె చెప్పిన వివరాలపై ఎందుకు దర్యాప్తు జరపలేదు? కేసు నమోదు చేసుకొని ఆమె నుంచి అదనపు వివరాలు ఎందుకు సేకరించడం లేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యనేత వెనక్కి తగ్గినట్టేనా?
‘నేను మాట తప్పను, ఏది ఏమైనా వెనక్కి తగ్గను’ రాష్ట్ర ముఖ్యనేత తరుచూ చెప్పే మాట ఇది. ఇక పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, జైల్లో వేయిస్తా వంటి గంభీర ప్రకటనలకు లెక్కేలేదు. కానీ సుమంత్ విషయంలో మాత్రం ఆ జోరు మాయమైంది. అర్ధరాత్రి మంత్రి ఇంటి మీదికి పోలీసులను పంపిన వ్యక్తి, ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వెనుకడుగు వేయను అని చెప్పే ముఖ్యనేత, ఒక ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి మాత్రం సాహసించడం లేదు. దీంతో ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సుమంత్‌ను అదుపులోకి తీసుకోకుండా పోలీసు విధులకు అడ్డం పడిన మంత్రి కూతురు సుస్మిత మీద పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదు చేస్తారని అన్నారు, కానీ అది కూడా జరగలేదు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసంతోపాటు, హన్మకొండలోని నివాసం వద్ద భద్రతను ఉపసంహరించడం, పోలీస్ ఔట్ పోస్ట్ తీసేయడం, ఇంటి వద్ద పోలీసుల పహారా వంటి ఘటనలతో హల్చల్ చేశారు. అదే రోజు మంత్రివర్గ సమావేశంతో కొండా సురేఖకు ఉద్వాసన పలుకబోతున్నట్టు సంకేతాలు పంపించారు. కానీ సాయంత్రానికి అసలేం జరగనట్టు వ్యవహరించారు.
ఇద్దరి గుట్టూ బయట పడకుండానేనా?
సుమంత్ వ్యవహారంపై రెండు రోజుల కింద ఢిల్లీ దూత దగ్గర పంచాయితీ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా ‘అసలు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందా?’ అని ప్రశ్నించారని తెలిసింది. ఎఫ్ఐఆర్ లేకుండా, కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా ఒక మంత్రి ఇంటి మీదికి పోలీసులను ఎలా పంపిస్తారని ముఖ్యనేతను ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో దక్కన్ సిమెంట్స్ నుంచి వసూళ్లతోపాటు ఇతర వ్యవహారాల గురించి ముఖ్యనేత వివరించినట్టు సమాచారం. దీనిపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. ముఖ్యనేత, ఆయన అనుచర వర్గం చేస్తున్న భూ దందాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలా ఇద్దరికీ సంబంధించిన దందాలు బయటపడటంతో ఇద్దరూ కాంప్రమైజ్ అయినట్టు సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేసినట్టు కేంద్ర నిఘాసంస్థలతో విచారణ జరిగితే ప్రభుత్వమే పతనం అంచున నిలబడే ప్రమాదం ఉన్నదని ‘ఆమె’ సూచించటంతో తేలు కుట్టిన దొంగల్లాగా ఇద్దరూ గప్‌చుప్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
తక్కువ చేసి చూపించే ప్రయత్నం
ఏకంగా మంత్రి ఇంటిపైకే పోలీసులు వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. కాంగ్రెస్‌లో ఇలాంటివి సర్వ సాధారణం అని, టీ కప్పులో తుఫాన్ లాంటిదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. విభేదాలన్నీ సమసిపోయాయని ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన జారీ చేసేశారు. రాష్ట్రంలో మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చిన్న విషయమా? ఒక మంత్రి ఇంటిపైకి అర్ధరాత్రి పోలీసులు వెళ్లడం, చుట్టుముట్టడం, ప్రభుత్వ పెద్దలపై స్వయంగా మంత్రి బిడ్డ తీవ్ర ఆరోపణలు చేయడం కేవలం విభేదాలుగా పరిగణించాలా? అవన్నీ సమసిపోయాయని ఒక్క మాటతో తేల్చేస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి సురేఖ ఓఎస్డీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలని, వసూళ్ల దందా నిజమో? కాదో?, దాని వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ముఖ్యనేత, ఆయన బ్రదర్స్.. కీలక మంత్రులు, వ్యక్తులపై మంత్రి సురేఖ బిడ్డ సుస్మిత చేసిన ఆరోపణలపై లోతుగా దర్యాప్తు జరపాలని పట్టుబడుతున్నారు. వాస్తవాలుంటే పదవుల్లోంచి తొలిగిపోవాలని, లేకపోతే ఆరోపణలు చేసినందుకు చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
సురేఖ స్వరం ఎందుకు మారింది?
సుమంత్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది మొదలు మంత్రి కొండా సురేఖ రెండు రోజలపాటు హడావుడి చేశారు. ముఖ్యనేతతోపాటు సహచర మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ ఆమె కూతురు తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ బీసీ నినాదం ఎత్తుకుంటే.. ఇక్కడ మాత్రం రెడ్ల రాజ్యం నడుస్తున్నదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి రాత్రికి రాత్రే మనసు మార్చుకున్నారు. శనివారం జరిగిన బీసీ బంద్‌కు మద్దతుగా ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. తమ నాయకుడు రెడ్డి అయినా బీసీల కోసం మద్దతు ఇస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. పైగా వరంగల్‌లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని అకస్మాత్తుగా ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవి పోతుందనే భయంతోనే ఇలా చేశారా? అని అడుగుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి అన్నదమ్ములు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి రాష్ట్రంలో భూములు కబ్జా చేస్తున్నరు. వారికి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నరు. దక్కన్ సిమెంట్ విషయంలో గన్‌తో బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అసలు గన్ ఇచ్చిందే రేవంత్‌రెడ్డి, ఆ గన్ రోహిన్‌రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్లను డబ్బుల కోసం బెదిరించిండు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొంగులేటి మాపై పగబట్టి కక్ష సాధిస్తున్నరు. – కొండా సుస్మిత, మంత్రి సురేఖ కూతురు