హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా తిరుమలలో ఉచిత దర్శనాలను నిలిపివేయడం సరికాదని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. నిర్దిష్ట సంఖ్యలో భక్తులను ఉచిత దర్శనానికి అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి సూచించారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్న పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు గురువారం రిషికేష్‌లో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. కొత్త ఆలయాల నిర్మాణంపై శ్రద్ధ చూపుతున్నట్టే.. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు సైతం టీటీడీ కృషి చేయాలని ఆయన కోరారు.