
లింగాలఘనపురం, డిసెంబర్ 20: అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడేనికి చెందిన ఎన్నారై కొడుకు మృతిచెందగా, కూతురు పరిస్థితి విషమంగా ఉన్నది. గ్రామానికి చెందిన ఎన్నారై చెట్టుపెల్లి రాంచంద్రారెడ్డి ఉద్యోగరీత్యా కుటుంబంతో లాస్ఏంజిల్స్లో నివసిస్తున్నారు. స్నేహితుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఆదివారం కారులో భార్య అలివేలు, కూతురు అక్షిత, కొడుకు అర్జిత్రెడ్డి (14)తో కలిసి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. వెనుక సీట్లో కూర్చున్న అక్షిత, అర్జిత్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ అర్జిత్రెడ్డి చనిపోగా.. అక్షిత పరిస్థితి విషమంగా ఉన్నది. బండ్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.