సంగారెడ్డి, మే 16 : అన్నదాతలు అధిక దిగుబడినిచ్చే మామిడి తోటలు పెంచి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూ చించారు. శనివారం సంగారెడ్డి అస్తబల్లోని ఫలపరిశోధన కేంద్రంలో మామిడిపండ్ల ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఏటా సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేం ద్రంలో మామిడి పండ్ల ప్రదర్శన ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బా పూజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏటా ప్రదర్శన ఏర్పాటు చేసి, రైతులకు మామిడిసాగుపై మెళకువలు వివరిస్తూ, ప్రోత్సహించడం మంచి నిర్ణయం అని అభినందించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు కొత్త వంగడాలు సృష్టించి రైతులకు అందజేస్తున్నారని తెలిపారు. దీంతో తక్కువ కాలంలో అధిక దిగుబడులు సాధిస్తూ ఆర్థికంగా రైతులు బలపడుతున్నారని చెప్పారు. సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో 300కు పైగా మామిడి రకాలు ఉన్నాయని, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో మొక్కలు తీసుకెళ్లి మామిడి సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఆదివారం నుంచి మామిడిపండ్ల ప్రదర్శన నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఫల పరిశోధన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ వెంకటలక్ష్మి, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.