హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మంచి జీతభత్యాలు, మంచి వసతులు, సౌకర్యాలు కల్పించే పోస్టులకు.. పోటీ భారీగా ఉండటం ఖాయం. ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. తాజాగా పిలిచిన స్టాఫ్ నర్స్ పోస్టులకూ ఇదే పరిస్థితి నెలకొంది. 84 స్టాఫ్ నర్స్ పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్ ఇస్తే 11,133 మంది పోటీ పడుతున్నారు. అందులో తొలిసారి స్టాఫ్ నర్స్‌ల పోస్టులకు 718 మంది పురుషులు కూడా పోటీపడుతుండటం విశేషం.
ఈ పరీక్ష ఈనెల 29న కొత్తగూడెం, పాల్వంచల్లోని 18 కేంద్రాల్లో నిర్వహించేందుకు సింగరేణి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సింగరేణి పరిధిలో స్టాఫ్ నర్సుల 84 పోస్టులను భర్తీచేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి 13,379 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. స్క్రూటినీలో సరైన అర్హతలు లేకపోవడంతో 2246 మంది అభ్యర్థులకు తిరస్కరించారు.
దీంతో మొత్తం 11,133 మందికి హాల్ టిక్కెట్లు జారీచేశారు. ఇందులో 10415 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. తమకూ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొందరు పురుష అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సానుకూలంగా స్పందించడంతో వారికి కూడా స్టాఫ్ నర్స్ పరీక్ష రాసేందుకు సింగరేణి అనుమతిచ్చింది. మొత్తం 84 పోస్టులకు 11,133 మంది పోటీ పడుతుండటంతో.. సగటున ఒక్కో పోస్టుకు 132 మందికిపైగా పోటీపడుతున్నట్లు అర్థం అవుతున్నది.
ఉద్యోగాలను కేవలం అర్హతలు, రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని, ఎలాంటి మోసపూరిత వ్యవహారాలను నమ్మవద్దని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరాం స్పష్టంగా చెప్పారు. పూర్తి పారదర్శకంగా పరీక్షలను నిర్వహిస్తున్నట్టు, ప్రతిభావంతులకే ఉద్యోగం దక్కేలా పరీక్ష విధానం ఉంటుందన్నారు. పరీక్ష ప్రశ్నాపత్రం తయారీ మొదలు దాన్ని పరీక్షా కేంద్రానికి తరలించే వరకు ప్రతి అంశం గోప్యంగా ఉంటుందన్నారు. పరీక్ష నిర్వహణలో పాల్గొనే సిబ్బందిని కొద్ది రోజుల ముందు నుంచీ నిఘా పర్యవేక్షణలో సెల్ఫోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థకు దూరంగా, రహస్య ప్రదేశంలో ఉంచుతున్నామని డైరెక్టర్ వివరించారు.
పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని బలరాం తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకొచ్చినా.. డిబార్ చేస్తామని తెలిపారు. భవిష్యత్‌లోనూ సింగరేణి పోస్టుల భర్తీ పరీక్షలకు అనుమతించమని, వారిపై కేసులుకూడా నమోదు చేయనున్నట్టు ఆయన వివరించారు.