చిట్యాల, అక్టోబర్ 8: సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నది. సంక్షేమ ఫలాలు అందుకొన్న లబ్ధిదారులు సంతోషంతో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్తున్నారు. సర్కారు దవాఖానలో పైసా ఖర్చులేకుండా ప్రసవాలు చేయడంతోపాటు కేసీఆర్ కిట్, రూ.12 వేల నగదు అందిస్తున్న తీరుపై సంబురపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లికి చెందిన బొడ్డు ప్రవళిక చిట్యాల సివిల్ హాస్పిటల్లో ప్రసవించింది. ఆమెకు ప్రభుత్వ దవాఖానలో అందిన వైద్యసేవలు, ప్రసవానికి ముందు, తర్వాత డాక్టర్లు తనపైన చూపిన కేరింగ్, కేసీఆర్ కిట్‌పై ఆనందం వ్యక్తంచేసింది. ‘పండంటి బాబుకు జన్మనిచ్చాక నాకు అందిన మొదటి కానుక కేసీఆర్ కిట్’ అని ఆమె సంతోషంగా చెప్పింది. గర్భందాల్చిన నుంచి ఇక్కడే వైద్య సేవలు పొందాను. సెపరేట్ బెడ్, నాతో వచ్చిన అమ్మకు, నాకు కోడిగుడ్డుతోపాటు, పాలు, మంచి భోజనం అందించడం, బాబుకు కేసీఆర్ కిట్ ఇస్తున్నప్పుడు ఏదో పెద్ద దవాఖానలో ప్రసవించినట్టు అనిపించింది. ప్రభుత్వ దవాఖానలో నేను ప్రసవించడంవల్ల మా ఆయనకు రూ.50వేలు మిగిలినట్లే. వెనుకట అమ్మవాళ్లు అనేది సర్కారు దవాఖానలో అపరేషన్ చేస్తే బాగాచేయరని, ఇప్పుడు ఆ ఆలోచనలేదు. సర్కారు దవాఖాన మస్తుగున్నది. సీఎం సార్‌కు కృతజ్ఞతలు.