న్యూఢిల్లీ : తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులకు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ మంత్రుల బృందం నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డితో పాటు ఎంపీలు నామా నాగేశ్వర రావు, బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి కలిశారు. యాసంగిలో వరి ధాన్యం సేకరణపై మంత్రితో చర్చించారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై సానుకూల నిర్ణయం రాలేదు.
ఈ నెల 23న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, నరేంద్రసింగ్ తోమర్‌తో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. నాటి భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పూర్తి స్పష్టత ఇవ్వని కేంద్ర మంత్రులు ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని ప్రతిపాదించారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి.. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసమే కేంద్రమంత్రిని కలిశామన్నారు.
మేము చాలా ఆశతో ఈ సమావేశానికి వచ్చాం. కానీ.. కేంద్ర ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. గత వారం కూడా కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. సంవత్సరానికి ఎంత కొంటారు అని కేంద్రాన్ని అడిగాం. కానీ.. ముందస్తుగా అంచనా వేసి చెప్పడం సాధ్యం కాదు అని కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే వరికోతలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంత కొంటామని చెప్పలేదు. తెలంగాణలో రైతులు 58 లక్షల ఎకరాలు వరి పండించారని కేంద్రం ఒప్పుకుంది. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం చెబుతోంది. కానీ.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వరి వేయాలని చెబుతున్నారు అని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం.. అని నిరంజన్ రెడ్డి తెలిపారు.