కవాడిగూడ : హుజురాబాద్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికలకలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బలపరుచాలని భారత జాతీయ లోక్‌దళ్ పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పుల్లూరి వెంకటరాజేశ్వర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సంక్షేమ పథకాలు అందించే టీఆర్ఎస్ కు, అబద్దాలు, స్వార్ధ రాజకీయాలు చేసి తెలంగాణకు మొండిచెయ్యి చూపే బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ది కావాలా.. స్వార్ధ పరులు, మతతత్వ వాదులు ఆత్మాభిమానం పేర ఆత్మవంచన చేసుకుంటూ వేల కోట్లు సంపాదించి బీసీ నేతగా చెప్పుకొని ఆస్తులు, కేసుల నుంచి రక్షణ పొందేందుకు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ అరాచక పాలన కావాలో తేల్చుకోవాలని ఆయన కోరారు. రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు బీజేపీకి నచ్చక విమర్శలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఏడేండ్ల బీజేపీ పాలనలో మోడీ చేసిందేమి లేదని అన్నారు. పగటి కలలు కంటూ ఉద్యమకారులను, నిరుద్యోగ యువతను రెచ్చగొడుతూ ప్రాంతీయ పార్టీలను విచ్చిన్నం చేయడానికి కేంద్ర అధికారాలను ఉపయోగించి భయబ్రాంతులకు గురిచేయడం శోచనీయమని ఆయన అన్నారు. బీజేపీ ఇలాంటి స్వార్ధ, మతతత్వ రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. నాయకులు వీరన్న నాయక్, విప్లవదత్ మిశ్రా, జహంగీర్ జోషి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు