ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. కంటివెలుగు కార్యక్రమం చేపట్టి ప్రజల కంటి సమస్యల పరిష్కారానికి రికార్డుస్థాయిలో పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయించింది. కంటి అద్దాలు పంపిణీ చేసింది. బస్తీలు, పల్లెల్లోని ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ చేసింది. దవఖానాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచింది. వైద్యవిద్య విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నది. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పూర్తి వివరాలు సభకు సమర్పించారు. అందులో పేర్కొన్న ప్రకారం..
-హైదరాబాద్, నమస్తే తెలంగాణ
కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు
2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు ప్రతి లబ్ధిదారుడికి నెలకు 12 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ప్రభుత్వం అందజేసింది. అనంతరం 2020 నవంబర్ వరకు ప్రతి లబ్ధిదారుడికి 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. మొత్తం రూ.720 కోట్ల 37 లక్షలతో 2 లక్షల 68 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీచేసింది.
కొవిడ్ సమయంలో తెలంగాణలో చికుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చింది. 151 ప్రత్యేక రైళ్ల ద్వారా 2,01,213 మందిని ఇతర రాష్ర్టాల్లోని తమ స్వస్థలాలకు చేర్చింది. 2020 ఏప్రిల్, మే నెలల్లో బియ్యంతో పాటు రూ.1,500 అందించింది. వలస కార్మికులకు ఒక్కొక్కరికి ప్రతి నెలా 12 కిలోల చొప్పున ఏప్రిల్, మే నెలల్లో బియ్యం పంపిణీ చేసింది. ఇందుకు రూ.42 కోట్ల 84 లక్షలు ఖర్చు చేసింది.
కొవిడ్ సంసిద్ధత
గతంలో ఆక్సిజన్ బెడ్లు కేవలం 1,400 మాత్రమే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వాటి సంఖ్యను 20,517కు పెంచింది. మొత్తం 24 ప్రధాన దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వ చేయడానికి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటుచేసింది.
ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 144 మెట్రిక్ టన్నుల నుంచి 286కు పెంచింది. అదేవిధంగా 586 మెట్రిక్ టన్నుల సామర్థ్యం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. 25 ఆర్టీపీసీఆర్
ల్యాబులను నెలకొల్పింది. మరో
8 ఏర్పాటుచేయబోతున్నది.
కంటివెలుగు కార్యక్రమం
కంటివెలుగు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల రికార్డు సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించింది. 41 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసింది.
పల్లె దవాఖానలు
రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానల మాదిరిగా పల్లెల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే 537 పల్లె దవాఖానాలు ప్రారంభించింది.
దవాఖానల్లో మౌలిక వసతుల అభివృద్ధి
రాష్ట్రంలో 2014 వరకు ప్రభుత్వ దవాఖానల్లో 17,130 బెడ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 27,996కు పెరిగింది. గతంలో ఆక్సిజన్ బెడ్లు 1,400 మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఆక్సిజన్ బెడ్ల సంఖ్య 20 వేల 517కు చేరింది.
వైద్య విద్యకు ప్రాధాన్యం
రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 5 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం 12 వైద్య కళాశాలలను మంజూరు చేసింది. టిమ్స్ పేరుతో ఐదు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను కొత్తగా మంజూరుచేసింది. వీటిలో హనుమకొండలో ఒకటి, హైదరాబాద్లో నాలుగు ఉన్నాయి.