ఆదిలాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇతర రాష్ట్రాల వాసులు కేసీఆర్(CM KCR) అమలు చేస్తున్న పథకాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతొలిలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు(Chhattisgarh) చెందిన గణేశ్ పటేల్ అనే కూలీ తెలంగాణ పథకాలపై ప్రశంసలు కురిపించారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు తేడా ఆయన మాటల్లోనే..
మాది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజనందిగాం జిల్లా డొంగ్రగాం. మా రాష్ట్రంలో ఉపాధి లేక ఆదిలాబాద్ జిల్లాకు వలస వచ్చాం. రెండేండ్లుగా ఇక్కడే ఉంటూ డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం బాగా పనిచేస్తున్నది. మా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల హామీలు ఇస్తున్నది. కూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. మాకు కేవలం రూ.300 కూలీ దొరుకుతది.
ఇక్కడ రూ.800 కూలీ ఇస్తున్నరు. మా దగ్గర వృద్ధులకు కేవలం రూ.300 పింఛన్ ఇస్తున్నరు. తెలంగాణలో రూ.2,016 ఇస్తున్నరు. మా దగ్గర పేదింటి ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం సాయం చేయదు. తెలంగాణ సర్కారు రూ.1,00,116 అందిస్తున్నది. దీంతో రైతులు, కూలీలు పనులు లేక తెలంగాణకు వలస వస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు వలసొచ్చి వివిధ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు మంది ఉంటారు.
ఇక్కడి ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం అందజేస్తున్నది. మా రాష్ట్రంలో గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవమైతే డబ్బులు రావు. ఇక్కడ రూ.12 వేలు ఇస్తున్నారు. మా దగ్గర రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటది. రోడ్లపై సైకిల్ కూడా నడిపే పరిస్థితి ఉండదు.
కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాజీవ్‌గాంధీలను ఎవరూ నమ్మవద్దు. రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటను మా వద్ద కోనేవారు ఉండరు. కరెంటు ఎప్పుడు పోతది. చీకట్లోనే ఉంటం. తెలంగాణలో మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతూ సంతోషంగా ఉన్నరు.