హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సనత్‌నగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని సనత్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. బుధవారం రాంగోపాల్‌పేట డివిజన్లోని మంజు థియేటర్, ఆవుల మంద, నాగన్న దేవిడి, కళాసి గూడ, బర్ధన్ కాంపౌండ్, కండోజి బజార్లలో పాదయాత్రగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతో గోస పడుతున్న నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలలోనే తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తన దృష్టికి వచ్చినే వెంటనే పరిష్కరిస్తూ వస్తున్నట్లు చెప్పారు. 2014 కు ముందు నియోజకవర్గ పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్తలను కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసినట్లు వివరించారు.
నూతన రిజర్వాయర్ లను నిర్మించియా తాగునీటి సమస్యను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. సీఎం సహకారంతో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మోడల్‌గా తీర్చిదిద్దామని, మరోసారి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మిగిలిన అభివృద్ధి పనులను కూడా చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రచారంలో మంత్రి వెంట సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిరణ్మయి, బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు, విజయ్, ఆనంద్ పాటిల్, కిశోర్, తదితరులు పాల్గొన్నారు.