గట్టుప్పల్, మే 15 : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. ఇటీవల గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో జరిగిన హత్య వివరాలను డీఎస్పీ గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గట్టుప్పల్ మండలం వెల్మకన్నే గ్రామానికి చెందిన వల్లపు మల్లేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య హేమలతకు అదే గ్రామానికి చెందిన రేవెల్లి నవీన్‌తో పరిచయం ఏర్పడింది.
అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన మల్లేశ్ భార్య హేమలతను పలుమార్లు మందలించాడు. అయినా ఆమె తీరు మారలేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త మల్లేశ్‌ను హత్య చేయాలని హేమలత నిర్ణయించుకుంది. అందుకు ఆమె ప్రియుడు నవీన్‌తో కలిసి పథకం రూపొందించింది. వీరు వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 10న మల్లేశ్‌కు హేమలత ప్రియుడు నవీన్ తన బైక్‌పై తీసుకెళ్లి ఫుల్‌గా మద్యం తాపించాడు. అనంతరం బైక్‌పై ఇంటికి తీసుకొచ్చి దింపాడు.
అదేరోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న మల్లేశంను నవీన్‌తో పాటు హేమలత గొంతు నులిమి హత్య చేశారు. అతడిది సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించారు. మృతుడి తల్లి వెంకటమ్మ కోడలు హేమలతపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన చండూరు సీఐ ఆదిరెడ్డి, గట్టప్పల్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి, ఏఎస్ఐ అంజయ్య, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.