కోదాడ, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ భరోసా పథకంతో రూ.3.5 కోట్లతో ఆపదలో ఉన్న ఫొటోగ్రాఫర్ల కుటుంబాలకు అండగా నిలిచామని తెలంగాణ రాష్ట్ర ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులు షేక్ హుస్సేన్(Shaik Hussain) తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో థి కోదాడ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని షేక్ హుస్సేన్ వెల్లడించారు.
అందరం ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలం. వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు క్రియేటివిటీ స్కిల్స్‌ను పెంచుకొని వృత్తిలో రాణించాలి అని షేక్ హుస్సేన్ సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావులు మాట్లాడుతూ.. కోదాడలో ఫొటోగ్రాఫర్ల భవన నిర్మాణానికి మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వపరంగా ఫొటోగ్రాఫర్లకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు వనపర్తి వర్మ, ప్రధాన కార్యదర్శి కరీశ స్వామి, కోశాధికారి నక్క సురేష్ బాబు తదితర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ సభ్యులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కూకుట్ల లాలు, గౌరవ అధ్యక్షులు బొమ్మల వెంకన్న, జూలూరు బసవయ్య, జెమిని నరేష్, పిల్లుట్ల వెంకట్, కలర్ ల్యాబ్ వాసు, తదితరులు పాల్గొన్నారు.