
సూర్యాపేట టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే యావత్ తెలంగాణ ప్రజానీకం ఉందని.. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృధ్ధి తో తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలకు భవిష్యత్ శూన్యంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం చివ్వెంల మండలం గుంపులకి చెందిన తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచ్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మంత్రి జగదీశ్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ సమాజంలో పూర్తి స్థాయిలో ఆదరణ కోల్పోతున్న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలలో కొనసాగు తున్న అరకొర నాయకులు కంటున్న కళలు పగటి కళలవుతాయని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ సమాజం కేసీఆర్ను వదులు కోదని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను మించిన పరిపాలకులు యావత్ దేశంలోనే ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు.
ఇక్కడి ప్రతి పక్షాలు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే స్థితిలో లేవని ఆయన విమర్శించారు. వారిదెప్పుడు భాద్యతారాహిత్య మేనని విరుచుకు పడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారెవరూ ప్రజలతో కలిసి రాకపోగా తెలంగాణ ఏర్పడ్డాక కూడా వారిది ఆంద్రా పక్షమేనని ఆయన ఆరోపించారు. నిరంతరం అభివృధ్ధి పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే యావత్ తెలంగాణ ప్రజానీకం ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కాసం లింగారెడ్డి, నాతాల శేఖర్ రెడ్డి, ఎర్ర నారాయణ రెడ్డి, పచ్చిపాల అనీల్, పిట్ట రాజశేఖర్ రెడ్డి, నకిరెకంటి గోపి, ఏసోబు, మామిడి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.