సూర్యాపేట సిటీ, జూన్ 25 : ట్రైనీ ఎస్ఐలు ప్రజా సంబంధాలు, సాంకేతికంగా నైపుణ్యం పెంచుకోవాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ సూచించారు. ఆరు నెలల శిక్షణకు వచ్చిన 37మంది ట్రైనీ ఎస్ఐలకు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం సలహాలు, సూచనలు చేశారు. పరిస్థితులపై అవగాహన పెంచుకుని, వ్యక్తిగత అవసరాలను పక్కనబెట్టి ప్రజల కోసం పని చేయాలని అన్నారు. విధి నిర్వహణలో ఎలా మెలుగాలో, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ శిక్షణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సమయాన్ని వృథా చేసుకోవద్దని, నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తోటి వారిని కలుపుకొని టీమ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారన్నారు. తమ పరిధిలో ముందస్తు సమాచారం అందించే వనరులను ఏర్పరుచుకోవాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రజా సంబంధాలు చాలా ముఖ్యమని, సాంకేతికత, ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లపై నైపుణ్యం సాధించాలని, ఫిర్యాదుదారులకు భరోసా, నమ్మకం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేశ్, ఆర్ఐలు నర్సింహారావు, గోవిందరావు, శ్రీనివాస్, ఎస్ఐ నవీన్, ఎస్ఐలు పాల్గొన్నారు.