సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న నకిలీ కాఫీ, సిగరెట్లు అమ్ముతున్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపి, భారీగా నకిలీ సరుకులను మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ శివశంకర్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు ఇతర సరుకులు తెచ్చి కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా విక్రయిస్తున్న ముఠాపై విశ్వసనీయత సమాచారం మేరకు పట్టణంలోని వెంకటేశ్వర నగర్ లో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇతర సరుకులను సీజ్ చేశారు.
ఈ వ్యవహారంలో పావులూరి నారాయణమూర్తి, అనుప్ అగర్వాల్, సతీష్ ఏడిద అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్స్ కూడా తీసుకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకేజింగ్ చేసి, అమాయక వినియోగదారులను మోసం చేస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యతలేని పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరించారు.
ఈ నకిలీ రాకెట్ వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ను వెలికితీయడానికి పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.