బొడ్రాయిబజార్, నవంబర్ 18 : రాష్ట్రంలో రైతుల ధైర్యం, ఆత్మ విశ్వాసానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టానికి ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉండడంతో అన్ని విధాలా రైతుల సంక్షేమానికి పాటుపడుతూ రాష్ట్ర బడ్జెట్లో 60శాతం కేటాయిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి ప్రధానంగా కావాల్సిన సాగునీరు, పంట పెట్టుబడి, మార్కెట్ సౌకర్యం కల్పనకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు 20లక్షల బోర్లతో వ్యవసాయం చేసిన రైతులు ప్రస్తుతం 24గంటల ఉచిత విద్యుత్‌తో తమకున్న భూమినంతా సాగు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం, పక్క రాష్ట్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా విద్యుత్ రంగంలో తనదైన విధానంతో దేశంలో ఉచిత విద్యుత్ అందిస్తున ఏకైక రాష్ట్రం తెలంగాణగా చరిత్రకు ఎక్కించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.
ప్రజలకు ఒక పూట తిండి పెట్టలేని విధానాలు కేంద్రం అవలంబిస్తుంటే సీఎం కేసీఆర్ నేడు దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణను తీర్చిదిద్దారని కొనియాడారు. రైతుల సంక్షేమానికి రుణమాఫీ, పంట పెట్టుబడి, రైతుబంధు అందిస్తూ రైతు సంక్షేమానికి పాటు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్లను ఎత్తివేయాలని చూస్తే సీఎం కేసీఆర్ మార్కెట్లను నడిపించి తీరుతామని కచ్చితంగా చెప్పి నడుపుతున్నారన్నారు. దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని ప్రజలు సరైన సమయంలో ఆయన నాయకత్వాన్ని బలపర్చి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎండీ.ఫసీయోద్దీన్, అసిస్టెంట్ సెక్రటరీ పుష్పలత, యూడీసీ ఖాసిం, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.