‘యాసంగి సీజన్లో పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని సంకల్పించినందున రైతులు ఆందోళన చెందవద్దు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 260 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే 33 కేంద్రాలను ప్రారంభించాం. రైతులు తొందరపడి వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవద్దు. వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చే సీరియల్ ప్రకారం ధాన్యాన్ని కేంద్రాలకు తెస్తే ఇబ్బందులు తలెత్తవు. ధాన్యాన్ని శుద్ధిచేసి తేమ లేకుండాతీసుకురావాలి.
కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద జిల్లాస్థాయి అధికారులతోపాటు, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ నిరంతరంగా ఉంటుంది. ఆరు క్లస్టర్ పాయింట్ల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు సజావుగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమ చేయనున్నాం’ అని పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎం.గోపీకృష్ణ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు చేపడుతున్న ఏర్పాట్లను ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో వివరించారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోలేదు. దాంతో తామే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారయంత్రాంగం కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో ఏర్పాటు చేసే కేంద్రాలు, ధాన్యం కొనుగోలు లక్ష్యం, రైతులకు ఇబ్బందులు కలుగకుండా తీసుకుంటున్న చర్యలు వాటి వివరాలను పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎం.గోపీకృష్ణ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నమస్తే’:యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు?
డీఎం : రైతులు ఏ పంట ఎంతమేర సాగు చేశారనే సమాచారం వ్యవసాయశాఖ అధికారుల వద్ద ఉంది. వారి లెక్కల ప్రకారం.. జిల్లాలో యాసంగిలో 1,63,353 ఎకరాల్లో వరి సాగు చేశారు. 3,54,570 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉంది. 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశాము. ప్రస్తుతానికి ఐకేపీ ఆధ్వర్యంలో 92, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 164, మార్కెటింగ్ శాఖ ద్వారా 4 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టాం. కేంద్రాల సంఖ్యను 260 నుంచి 280 వరకు పెంచే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం 33 కేంద్రాలను ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తెచ్చాం.
నమస్తే : కేంద్రాల వద్ద వసతుల పరంగా తీసుకుంటున్న చర్యలేమిటి ?
డీఎం : ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాము. తాగునీటి వసతితోపాటు టెంట్లు వేసి నీడ కల్పించాలని చెప్పాం. వర్షం వస్తే ధాన్యం తడువకుండా టార్పాలిన్లను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ధాన్యం విక్రయించుకునే విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ట్రక్ షీట్ రాగానే ట్యాబ్ ఎంట్రీ చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలిచ్చాం. ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
నమస్తే : కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తిన సందర్భంలో తీసుకుంటున్న ముందస్తు చర్యలేమిటి?
డీఎం : జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో కోతలు ప్రారంభం కాలేదు. మోత్కూరు, వలిగొండ, నారాయణపురం, రామన్నపేట ప్రాంతాల్లో మాత్రమే మొదలయ్యాయి. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం.
కేంద్రాలకు ధాన్యం పోటెత్తిన సందర్భంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నాం. టోకెన్లు జారీ చేసి సీరియల్ ప్రకారం కేంద్రాలకు ధాన్యం వచ్చేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించాం. తేమ శాతాన్ని కూడా ఆ శాఖ అధికారులే నిర్ధారించనున్నారు. రైతులు ధాన్యాన్ని శుద్ధి చేసి, తేమ లేకుండా తీసుకొస్తే కొనుగోళ్లకు ఆటంకం లేకుండా ఉండడంతోపాటు ప్రభుత్వ మద్దతు ధర రూ.1,960 పొందవచ్చు.
నమస్తే : రవాణా, ధాన్యం నిల్వల పరంగా ఇబ్బందులున్నాయా ?
డీఎం : కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు జిల్లాలో భువనగిరి, ఆలేరు, మోత్కూరు, చౌటుప్పల్, వలిగొండ, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లో క్లస్టర్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాం. గన్నీ బ్యాగుల కొరత లేకుండా అవసరమైనన్ని అందుబాటులో ఉంచుతున్నాం. ప్రస్తుతానికి 11 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలిస్తున్నందున మిల్లుల్లో నిల్వ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. సీఎంఆర్ కోసం ఇచ్చే సందర్భంలోనూ సరిపోయే స్థాయిలో గోదామ్లు అందుబాటులో ఉన్నాయి.
నమస్తే : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఎం : జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఐకేపీ, మార్కెటింగ్, పీఏసీఎస్‌లతోపాటు రెవెన్యూ తదితర శాఖల సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాస్థాయి అధికారులు, మండల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు కేంద్రాలను సందర్శించి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద కూడా రెవెన్యూ సిబ్బందిని ఉంచుతున్నాం. ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించనున్నారు. మానిటరింగ్ కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇతర రాష్ర్టాల నుంచి మన జిల్లాకు అక్రమంగా ధాన్యం తరలించే పరిస్థితులు లేవు. అయినప్పటికీ పటిష్ట నిఘా ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాం.