
సత్తా చాటిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు
భూదాన్‌పోచంపల్లి విద్యార్థికి 4వ ర్యాంకు
మరో ఇద్దరికి 10లోపు, ఒకరికి 15లోపు..
రామగిరి, ఆగస్టు 25 : టీఎస్ ఎంసెట్ ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మెరుగైన ర్యాంకులు సాధించారు. భూదాన్‌పోచంపల్లికి చెందిన రామస్వామి సంతోష్‌రెడ్డి 4వ ర్యాంకు, నల్లగొండ పట్టణానికి చెందిన సోమిడి సాత్వికరెడ్డి 10వ ర్యాంకు, శాలిగౌరారం మండలం చిత్తలూరుకు చెందిన బండగొర్ల రామకృష్ణ 10వ ర్యాంకు సాధించారు. కోదాడకు చెందిన గండికోట సాయిప్రద్యుమ్నకు 15, నేరేడుచర్లకు చెందిన
దొంతిరెడ్డి హన్వితారెడ్డికి 88వ ర్యాంకులు వచ్చాయి.
రామగిరి/సూర్యాపేట అర్బన్, ఆగస్టు 25 : టీఎస్ ఎంసెట్ ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. భవిష్యత్తులో ఇంజినీర్లుగా ఉద్యోగాలు సాధించి ఉత్తమ సేవలందిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. తమ పిల్లలు ర్యాంకులు సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయి ర్యాంకులు
భూదాన్ పోచంపల్లికి చెందిన రామస్వామి సంతోశ్‌రెడ్డి ఇంజినీరింగ్ విభాగంలో 4వ ర్యాంకు, శాలిగౌరం మండలం చిత్తలూరుకు చెందిన బండగోర్ల రామకృష్ణ మెడికల్ విభాగంలో 10వ ర్యాంక్, నల్లగొండలోని పద్మావతి కాలనీకి చెందిన సోమిడి సాత్వికరెడ్డి ఇంజినీరింగ్‌లో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు సాధించారు.
కోదాడ విద్యార్థికి 15వ ర్యాంక్
కోదాడటౌన్ : పట్టణానికి చెందిన గండికోట సాయి ప్రద్యుమ్న రాష్ట్ర స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు పవన్‌కుమార్, చంద్రిక ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. పదో తరగతి వరకు కోదాడలోని తేజ పాఠశాలలో, ఇంటర్ విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో చదివాడు. ఈ సందర్భంగా సాయి ప్రద్యుమ్న మాట్లాడుతూ అనుకున్న లక్ష్య సాధన కోసం ప్రణాళికా బద్ధంగా చదివినట్లు తెలిపారు.
నేరేడుచర్ల విద్యార్థికి 88వ ర్యాంకు
నేరేడుచర్ల : పట్టణానికి చెందిన దొంతిరెడ్డి హన్వితారెడ్డి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు సాధించింది. ఆమె నారాయణ కళాశాల హైదరాబాద్‌లో ఇంటర్ చదివింది. విద్యార్థిని శ్రీవాణి పాఠశాల డైరెక్టర్ కొణతం సీతారాంరెడ్డి, మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి, నారాయణ సంస్థల ప్రతినిధులు అభినందించారు.
ఇంజినీర్‌గా సేవలందిస్తా
భవిష్యత్తులో ఇంజినీర్‌గా సేవలందిస్తాను. అమ్మానాన్న ఎంతో శ్రద్ధతో చదివించారు. వారి కలలను నిజం చేయడమే నా లక్ష్యం. జేఈఈ అడ్వాన్స్‌లో కూడా మంచి మార్కులు వస్తాయని నమ్మకం. హైస్కూల్ వరకు నల్లగొండలో ఇంటర్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేశాను.
-సాత్వికరెడ్డి , నల్లగొండ
డాక్టర్ కావాలని ఉంది
మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న బండగొర్ల వీరస్వామి, అమ్మ పద్మ వ్యవసాయం చేస్తూ నన్ను చదించారు. 10వ తరగతి వరకు సూర్యాపేటలో ఇంటర్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో చదివాను. ఎంసెట్‌కు బాగా ప్రిపేరై చదవడం వల్లే మిడిసిన్ స్టేట్ 10వ ర్యాంక్ సాధించాను. మంచి డాక్టర్ కావాలన్నది నాకోరిక.
-బండగొర్ల రామకృష్ణ, చిత్తలూరు