కోదాడ, నమస్తే తెలంగాణ డిసెంబర్ 21 : ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని శ్రీరామచంద్ర మిషన్ (Sri Ramachandra Mission) ప్రతినిధులు అన్నారు. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా కోదాడలోని మేళ్లచెరువు కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఆదివారం వందలాది మందితో సామూహిక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కో-ఆర్డినేటర్ వరప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి, దయ, కరుణ వంటి మానవీయ విలువల పెంపునకు ధ్యానం ఎంతో దోహదపడుతుందని అన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఏకం చేసే శక్తి ధ్యానానికి ఉందని వరప్రసాద్ తెలిపారు. ఏకకాలంలో 171 దేశాల్లో ఈ వేడుకలు నిర్వహించడం విశేషమని వరప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం ధ్యానాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్, శివశంకర్, రామకృష్ణ, చంద్రశేఖర్, కనకదుర్గ, మాధవి తదితరులు పాల్గొన్నారు.