Crime News : సూర్యాపేట జిల్లాలో ఓ చిన్న వివాదం పెద్దదిగా మారి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నది. మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయమై రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది. దారుణమైన రక్తపాతానికి దారితీసింది. మాటామాటా పెరిగి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు వర్గాలు విచక్షణ కోల్పోయి ఏకంగా గొడ్డళ్లతో పరస్పరం దాడులకు తెగబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ దాడిలో ఒకరిపై ఒకరు వేసుకున్న గొడ్డలి వేట్లకు ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఘర్షణను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన మేళ్లచెరువు ఎస్ఐ నవీన్‌కుమార్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఓ చిన్న చెట్టు వివాదం ఇద్దరి ప్రాణాలు తీయడంతోపాటు పోలీసులకే గాయాలయ్యే స్థాయికి వెళ్లడంతో ఎర్రగడ్డతండాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.