నేరేడుచర్ల, ఏప్రిల్ 21: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల (Nereducharala) మండలంలోని చిల్లేపల్లి వద్ద పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. తమిళనాడుకు చెందిన లారీ కరీంనగర్ జిల్లా సైదాపూర్లోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 24 టన్నుల పత్తి లోడుతో వెళ్తున్నది. దానిని తమిళనాడులోని కోవైపట్టిలో ఉన్న మహావిష్ణు స్పిన్నింగ్ మిల్లుకు తరలిస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో చిల్లేపల్లి సమీపంలో అందులో ఉన్న పత్తికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దానికి గాలి తోడవడంతో లారీ మొత్తం వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ లారీ నుంచి దిగిపోయాడు. భారీగా మంటలు ఎగసిపడటంతో లారీతో సహా పత్తి మొత్తం కాలి బూడిదయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
అయితే ప్రమాదం జరిగిన సమాయంలో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షం వచ్చిందని, అది పిడుగు ప్రమాదమా.. లేక విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు అంటుకున్నాయా అనేది తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.80 లక్షల వరకు నష్టం జరిగి ఉండొచ్చని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.