సూర్యాపేట : అయ్యప్పస్వామి మాలధారణ సన్మార్గంలో నడవడానికి ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష వల్ల ఏకాగ్రత (Concentration) , క్రమశిక్షణ, ప్రశాంతత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వివరించారు.
కుల మతాలకతీతంగా అందరూ ఒక్కటేననీ, ప్రతి దీక్షాపరునిలో అయ్యప్పస్వామి కొలువై ఉన్నాడనీ, దీక్షాకాలంలోనే కాకుండా ఆ సుగుణాలను జీవితాంతం పాటించాలని సూచించారు. భక్తి పారవశ్యం, అకుంఠిత దీక్షతో స్వాములు 41 రోజులు దీక్ష చేయడం అభినందనీయమన్నారు. ఏకభుక్తంతో శరీరాకృతిమారుతుందన్నారు. అయ్యప్పస్వామి ఆశీస్సులు ప్రతీ ఒక్కరి పై ఉండాలని ఆకాంక్షించారు.