శనివారం 29 ఫిబ్రవరి 2020
భాషకందని భావం ప్రేమ

భాషకందని భావం ప్రేమ

Feb 14, 2020 , 03:39:15
PRINT
భాషకందని భావం ప్రేమ

కొత్త పుంతలు తొక్కుతున్న నేటితరం ప్రేమ ప్రేమ వివాహాలను ఒప్పుకుంటున్న తల్లిదండ్రులు నేడు ప్రేమికుల దినోత్సవం ప్రేమ రెండక్షరాల పదం.. రెండు జీవితాల గమనం.. కాలం మారినా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా ప్రేమకు ఉన్న విలువ, ప్రాధాన్యం మారడం లేదు. ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుంతో తెలియదు.. ప్రేమను సాధించడానికి యువతీ యువకులు భవ బంధాలను త్యాగం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ప్రేమ పెళ్లి చేసుకునేందుకు ఎంతదాకైనా తెగిస్తున్నారు. పురాణ కాలం నుంచి వస్తున్న ఈ ప్రేమ క్రమంగా స్వరూపం మార్చుకుంటోంది. గతంలో ప్రేమ పెళ్లి అంటే పంచాయతీలు, కొట్లాటలు ఉండగా నేడు పెద్దలే సుముఖత వ్యక్తం చేస్తూ పెళ్లి చేస్తున్నారు. ప్రేమించిన సహచరి కోసం నేడు ఎంతో మంది యువతీ, యువకులు ఆటుపోట్లను అధిగమించి సుఖంగా జీవన ప్రయాణం సాగిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సదర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం

నల్లగొండ విద్యావిభాగం :  వాలెంటైన్‌ ఒక మత గురువు. క్రీస్తూ శకం 3వ శతాబ్దంలో రోమ్‌ చక్రవర్తి క్లాడియస్‌ వివాహాలను నిషేధిస్తాడు. ఈ నిషేదానికి ఓ విచిత్రమైన కారణం ఉంది. యుద్ధంలో పాల్గొనే సైనికులు కుటుంబంపై ప్రేమానుబంధాలు పెంచుకుని ఆలోచిస్తూ సక్రమంగా యుద్ధంలో పోరాడలేకపోతున్నారని రోమ్‌ చక్రవర్తి వివాహాలను నిషేధించాడు. ఆ దేశ క్రైస్తవ మత గురువులు కూడా దీనికి సరేననడంతో యువకుల్లో వ్యతిరేకత వచ్చింది.  కానీ వాలెంటైన్‌ అనే క్రైస్తవ మత గురువు మాత్రం ఆ దేశ రాజు ఆజ్ఞానాన్ని వ్యతిరేకించి రహస్యంగా పెళ్లిళ్లు చేయడం ప్రారంభించాడు. ఇది ఆ నోట ఈ నోట చేరి రాజుకు తెలిసింది. 


రాజు ఆదేశాల మేరకు సేవకులు వాలెంటైన్‌ను బంధించి రాజదర్భాలో హాజరుపర్చాడంతో వాలెంటైన్‌కు రాజు మరణ శిక్ష విధించి జైల్‌లో ఉంచారు. ఇది తెలిసిన ఆ దేశ ప్రజలు, యువతులు జైలుకు వచ్చి వాలెంటైన్‌ను చూసి వెళ్లాడం ప్రారంభించారు. దేశంలో యువతులతోపాటు ఆదేశ సైనికాధికారి కుమార్తె కూడా వాలెంటైన్‌ను చూసేందుకు వచ్చి వెళ్లేది. ఇది తెలిసిన ఆ సైనికాధికారి తన కుమార్తెను జైలు వద్దకు వెళ్లాడుండా భద్రత చేశాడు. అప్పటీకే వాలెంటైన్‌ తన మనుస్సులోని మాటలను చెప్పేందుకు కాగితాలు లభించకపోవడంతో హృదయ ఆకారంలో ఉండే ఆకులపై (పత్రాలపై) ప్రేమ లేఖ రాసి కిటీకీ నుంచి బయటకు విసిరాడు. ఆమెకు తన ప్రేమను చివరి రోజుల్లో వెల్లడించినప్పటీకీ అది ఫలించకుండానే క్రీస్తూ శకం 270 ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ మృత్యువును చేరాడు. అతని ప్రాణత్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14ను “ ప్రపంచ ప్రేమికుల దినోత్సవం”గా  నిర్వహిస్తున్నారు.  


ఆకర్షణ వ్యామోహంలోనే నేటి ప్రేమలు అధికం...

ప్రేమించడం తప్పుకాదు. అర్హత లేకుండాప్రేమలలో పడడమే వైఫల్యానికి కారణమౌతోంది. ప్రేమకు ఎలాంటి అర్హతలుండవని... ఆస్తులు చూడకుండా ఇద్దరి మధ్య చిగురించేదే ప్రేమని కొట్టిపారేస్తున్నారు నేటి యువత. అయితే ప్రేమ వైఫల్యాలను విశ్లేషిస్తున్న న్యాయ నిపుణులు, పెద్దలు మాత్రం ప్రేమకు కొన్ని అర్హతలు ఉన్నాయని చెబుతున్నారు.  నేటి సమాజం లో వయస్కుల మధ్య ఎదుటి వారికి ఆకర్షణకు లోనవుతూ ప్రేమలో పడుతున్నారు.  ఈ క్రమంలో స్థిరత్వం లేక ప్రేమ పెళ్లిలు చేసుకున్న వారు చిన్నచిన్న తగాదాలతో   విడిపోతున్నారు. ఇరు పక్షాల్లో ఎలాంటి తగాదాలు ఉండవు అనుకున్న సందర్భంలోనే ప్రేమకు, పెళ్లిలకు శ్రీకారం చుట్టడం సమంజసం అంటున్నారు పెద్దలు. 


ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నప్పునడే కలిసి జీవించగం..

మేము ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు మాకు పరిచయం ఏర్పడింది.  కులాల అంతరాలు తోలగిపోవాలనే లక్ష్యంతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో కులాంతర వివాహం చేసుకున్నాం. ఆరోజు నుంచి నేటి వరకు ఇరుకుటంబ సభ్యుల సహకారంలో ఎలాంటి మార్పు లేదు. మా కుమారుడు, కూతరు చిన్నతనం నుంచే పుష్ప తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంటున్నారు. పుష్ప కుటుంబ సభ్యులకు కొన్ని విషయాల్లో వారి సామాజికవర్గం, బంధువుల నుంచి సమస్యలు ఎదురైనా వారి తండ్రి అన్నింటిని ఎదుర్కొని మా కుటుంబానికి అండగా ఉన్నారు. 


మేము టీఆర్‌ఎస్‌లో చేరి  ఉన్నత స్థానానికి చేరుతే విమర్శించిన వారే పుష్ప తండ్రికి అభినందనలు తెలిపారు. ఇద్దరు మనుషుల మధ్య మనసులు, వ్యక్తిత్వాలు ఏ సమయంలోనైనా కలవవచ్చు ... వ్యక్తిత్వాలు కలిసి జీవితం పంచుకోవాలనే ఆలోచనకు వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడి ఉన్నప్పుడే ఈ నిర్ణయాలు తీసుకోవాలి.ప్రేమ వివాహల్లో ఆర్థిక ఇబ్బందులు తరుచుగా ఎదురవుతుంటాయి. వీటన్నింటిని తట్టుకుని ప్రేమతో మెలిగి సమస్యలు పరిష్కరించుకోవాలి.ప్రేమించడం , ప్రేమించుకోవడం, ప్రేమ వివాహలు చేసుకోవడం తప్పు కాదు కానీ స్థిరమైన అభిప్రాయంతో  కలిసి జీవించినప్పుడే  విజయం సాధించగలం.

- వేముల వీరేశం-పుష్ప, నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే-గాయని 


ప్రజాసేవలో ఆదర్శ దంపతులు

అర్వపల్లి : మండల కేంద్రానికి చెందిన దావుల వీరప్రసాద్‌ యాదవ్‌-మనీష 2010వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమలో గెలవడమే కాకుండా 10 ఏళ్లుగా ఒకరినోకరు గౌరవించుకుంటూ రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు.  2014లో మనీష అర్వపల్లి ఎంపీపీగా ఎన్నికై 5 సంవత్సరాలు పనిచేయగా వీరప్రసాద్‌ ఆమెకు తోడు 

నీడగా  ఉండి ప్రజలకు సేవలందించారు. 2019లో వీరప్రసాద్‌ యాదవ్‌ అర్వపల్లి జడ్పీటీసీగా గెలుపొందగా మనీష ఆయన విజయంలో కీలకపాత్ర పోషించింది. 


కుటుంబం ఒకటి.... కులాంతర వివాహాలు మూడు 

కోదాడటౌన్‌ : కోదాడ మండలం కొమరబండకు చెందిన కందుల పాపయ్య-వెంకట్రామ్మలది ఒకే ఊరు. వికలాంగుడైన పాపయ్య కోదాడలోని ఓ థియేటర్‌లో పనిచేసేవాడు. సినిమాకు వచ్చే క్రమంలో పాపయ్య వెంకట్రామ్మల మధ్య ప్రేమ చిగురించింది. కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపువారు వివాహానికి అంగీకరించలేదు. దీంతో 1982లో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయారు. ఆర్థికంగా ఇబ్బందులు  తలెత్తినా ధైర్యం కోల్పోకుండా కలిసి జీవించారు. వీరికి ముగ్గురు సంతానం వీరి ఇద్దరు పిల్లలు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు.


కందుల మధుకు 2007లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్న సహ విద్యార్థిని విజయలక్ష్మితో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోకపోవడంతో 2010లో కులాంతర వివాహం చేసుకున్నారు. పిల్లాపాపలతో  సంతోషంగా ఉన్నారు.కందుల విక్రమ్‌ 2010లో హైదరాబాద్‌లో ఎంబీఏ చేస్తున్న సమయంలో సహ విద్యార్థిని ఉష పరిచయమైంది. ఇద్దరు బాగా చదువుకొని నాలుగేళ్లపాటు పరస్పరం అర్థం చేసుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులు ప్రేమ వివాహాలే చేసుకున్న వారు వావడంతో వీరి  వివాహానికి  ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. పెళ్లి తరువాత ఇద్దరం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.


logo