వచ్చేదంతా హాలిడేస్ సీజన్. కచ్చితంగా టూర్లు ప్లాన్ చేస్తుంటాం. అయితే, అందరికీ అన్ని భాషలు తెలియాలని రూల్ లేదు. సో.. అలాంటప్పుడు పర్యటించే ప్రాంతంలో ఏ భాష మాట్లాడినా మనం అర్థం చేసుకోవాలంటే? ఏముందీ.. ఓ ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే.. లోకల్‌గా ఉండే గైడ్‌ని ఆశ్రయిస్తే సరిపోతుంది అంటారా? అయితే, మీరు టెక్నికల్‌గా చాలా వెనకబడి ఉన్నట్టే. ఎందుకంటే.. చేతిలో స్మార్ట్ఫోనే ఉత్తమ అనువాదకుడిగా మారిపోయింది. అందుకు మీ ఫోన్ లో ‘గూగుల్ ట్రాన్స్‌లేటర్’ యాప్ ఉంటే చాలు. ఒకవేళ లేకపోతే యాప్‌ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి. దాంట్లోని ప్రధాన ఆప్షన్స్ వాడుకుని ఇట్టే అనువాదం చేయొచ్చు. ఇంతకీ ఏంటా ఆప్షన్స్? ఎలా వాడుకోవాలో కాస్త వివరంగా తెలుసుకుందాం.
ఇద్దరి మధ్య సాగే మాటల బదిలీనే సంభాషణ. మన భాష ఎదుటి వ్యక్తికి రాకపోయినా, ఆ వ్యక్తి భాష మనకు అర్థం కాకపోయినా.. ఆ సంభాషణ ఫలవంతంగా సాగదు. ఇలా భాష రాని వ్యక్తులు భావాలు పంచుకోవడానికి గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో ప్రత్యేకమైన ఆప్షన్ ఉంది. అదే ‘కన్వర్సేషన్’. యాప్‌ని ఓపెన్ చేయగానే ఎడమవైపు కింది భాగంలో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ట్యాప్ చేసి మీకు కావాల్సిన రెండు భాషల్ని ఎంపిక చేసుకోవచ్చు.
ఉదాహరణకు మీరు తెలుగు, అవతలి వ్యక్తి తమిళం మాట్లాడతారు అనుకుంటే.. ఆ రెండు భాషల్ని స్క్రీన్ మీద సెట్ చేసుకోవాలి. దీంతో మైక్రోఫోన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఇరువురి సంభాషణల్ని రియల్‌టైమ్‌లోనే వింటూ ట్రాన్స్‌లేట్ చేస్తుంది. స్పీకర్ బటన్‌పై నొక్కితే మీరు మాట్లాడేది తమిళంలో ఎదుటి వ్యక్తికి వినిపించొచ్చు. ఎదుటి వారు చెప్పేది తెలుగులోకి ట్రాన్స్‌లేట్ అవుతుంది. దీన్ని కావాలంటే మాన్యువల్‌గా కూడా చేయొచ్చు. ఒక్కో వాక్యాన్ని అనువాదం చేసుకుని.. ఎదుటివారికి వినిపించొచ్చు. ఎదుటి వారు మాట్లాడింది మన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.
ఏ ప్రాంతానికి వెళ్లినా కొన్ని వాక్యాలు పదేపదే వాడాల్సి వస్తుంది. ఉదాహరణకు.. ‘హలో అండీ.. నమస్తే!!, ఈ అడ్రస్ కాస్త చెబుతారా?, ఇక్కడ ఫుడ్ ఏ హోటల్లో బాగుంటుంది?, కాస్త పక్కకు జరుగుతారా?, వీటి ధరెంత?’ ఇలా కొన్ని పదాలు పదే పదే పలకాల్సి వస్తుంది. ఈ క్రమంలో మీరు సందర్శించే ప్రాంతానికి చెందిన భాషలో కొన్ని మాటల్ని ముందే అనువదించి సేవ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఆ పదాల్ని పలకడం కూడా కష్టం అవుతుంది. అందుకే.. ఆయా మాటల్ని బుక్‌మార్క్ చేసిపెట్టుకోవడం ద్వారా సులభంగా వాటిని వాడేయొచ్చు. అందుకు ఏం చేయాలంటే.. ఒక్కో వాక్యాన్ని ట్రాన్స్‌లేట్ చేసుకుని వాటి పక్కనే కనిపించే ‘స్టార్ట్’ని ట్యాప్ చేసి మార్క్ చేయొచ్చు. ఇలా మార్క్ చేసిన వాటిని ఎప్పుడైనా ఓ జాబితాగా యాక్సెస్ చేయొచ్చు. అందుకు గూగుల్ ట్రాన్స్‌లేట్ హోం స్క్రీన్‌పై కనిపించే ‘స్టార్ట్’ ట్యాప్ చేస్తే సరిపోతుంది.
ఒకవేళ ఏదైనా టెక్ట్స్ కంటెంట్‌ని కావాల్సిన లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయాలంటే? ‘ఎంటర్ టెక్ట్స్’ బాక్స్‌లో చేయొచ్చు. కంపోజింగ్ లేదా కాపీ, పేస్ట్ ద్వారా మేటర్ని తీసుకుని కావాల్సిన భాషలోకి అనువాదం చేసుకునే వీలుంది. ఇంకా కావాలంటే.. చేతి రాతతో రాసిన అక్షరాల్ని అనువాదం చేసే వీలుంది. అందుకు ఎంటర్ టెక్ట్స్ పక్కన కనిపించే పెన్సిల్ ఐకాన్ ట్యాప్ చేయాలి. ‘రైట్ హియర్’ బాక్స్‌లో వేలుతోగానీ, ైస్టెలస్తోగానీ మీకు కావాల్సింది రాస్తే.. అది ట్రాన్స్‌లేట్ అవుతుంది.
కొత్త ప్రాంతాలు తిరిగే క్రమంలో అక్కడ కనిపించే వాల్ పోస్టర్లు, నోటీస్ బోర్డులు, హోటల్ మెనూ.. ఇలా మనకు ఎదురుపడే వాటిని ఇట్టే ట్రాన్స్‌లేట్ చేసి అర్థం చేసుకోవాలంటే? సింపుల్.. గూగుల్ ట్రాన్స్లేట్లోని ‘లెన్స్’ని వాడొచ్చు. మీరేదైనా మెనూని తీసుకుని ట్రాన్స్‌లేట్ యాప్‌లోని కెమెరా ఆప్షన్ ఓపెన్ చేయండి. అప్పుడే మీకో మ్యాజిక్ కనిపిస్తుంది. చేతిలో మీరు పట్టుకున్న మెనూపై కెమెరాని ఉంచితే చాలు. అది ఫోన్ స్క్రీన్‌పై మీరు ఎంపిక చేసుకున్న భాషలోకి మారిపోతుంది.
అందుకు అనువుగా అనువాదం చేయాల్సిన రెండు భాషల్ని ఎంచుకోవాలి. అంతేకాదు.. అప్పటికే మీరు ఫొటోలు తీసిన బ్యానర్లు, పాంప్లెట్లను కూడా ఫొటో గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. ఫొటోను సెలెక్ట్ చేసిన మరుక్షణం అనువాదం అయిపోతుంది. ఇదే మాదిరిగా షాపింగ్‌లోనూ చేయొచ్చు. అంతేకాదు.. డ్రైవింగ్‌లో రోడ్డుపై ఉన్న సైన్ బోర్డులు, ఊర్ల పేర్లు అర్థం కాకపోతే.. కెమెరా ఆప్షన్లో దాగున్న గూగుల్ లెన్స్ వాడి అర్థం చేసుకోవచ్చు.