Fashion | చల్లగా తియ్యగా నోరూరించే పండు పుచ్చకాయ. ఎండకాలంలో దానికుండే డిమాండే వేరు. అయితే దీనికి పండ్ల మార్కెట్లోనే కాదు, ఫ్యాషన్ మార్కెట్లోనూ తెగ గిరాకీ ఉంది ఈ సీజన్లో. అందుకే దుస్తులు మొదలు నగలు, యాక్సెసరీల వరకూ అన్నిటా వాటర్మెలన్ ఫ్యాషన్ సందడి చేస్తున్నది.
ఎరుపు ఆకుపచ్చ రంగులంటే ఫ్యాషన్ ప్రపంచంలో వావ్ కాంబినేషన్. దీనికి తెలుపు అంచు కూర్చి నలుపు చుక్కలు చేరిస్తే ఐటెం ఏదైనా అదిరిపోవాల్సిందే. అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్లో ఉండే పుచ్చకాయను మాత్రం ట్రెండ్ గురూలు ఎందుకు వదులుకుంటారు. అటు హాట్ సమ్మర్లో కూల్‌గా కనిపించేలా, ఇటు ఫంకీ లుక్ అనిపించేలా నయా ఫ్యాషన్‌కి తెరతీశారు. దీంతో పుచ్చకాయ ముక్కల ప్రింట్లు, అదే మోడల్ని పోలి చేసిన పెండెంట్లు, దుద్దులు… అన్నీ ఇప్పుడు మాదే హవా అంటున్నాయి.
ట్రెండీ దునియాలో ఇప్పుడు వాటర్మెలన్ ఫ్యాషన్ నడుస్తున్నది అంటున్నారు ఫ్యాషనిస్టులు. అందుకే చూడగానే ఆకట్టుకునేలా నిండైన రంగుల్లో శారీ పండైన రంగుల్లో లాంగ్ ఫ్రాక్‌లు, మిడీలు, మ్యాక్సీలు, స్కార్ఫ్‌లు… ఇలా రకరకాల దుస్తులు సందడి చేస్తున్నాయి. అబ్బాయిల కోసమూ అంగీలు, టీ షర్టులు, షార్ట్‌లు భలే అనిపించేలా ముస్తాబవుతున్నాయి. అంతేకాదు, వీటికి జోడీగా ధరించేలా షూలు, టోపీలు, బ్యాగులు కూడా ఇవే డిజైన్లలో వస్తున్నాయి.
నగలు కూడా వగలు తక్కువ కాకుండా వాటర్మెలన్ ఫ్యాషన్‌లో వన్నెలీనుతున్నాయి. జుంకాలు, దుద్దులు, నెక్లెస్‌లు, బ్రేస్లెట్లు, ఉంగరాలు… ఇలా అన్నిటా ఎవర్గ్రీన్ కాంబినేషన్ సందడి చేస్తున్నది. ముస్తాబంతా అయ్యాక ముచ్చటగా వేసుకునే గొడుగునూ వేసవి ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. అదండీ సంగతి, కాలి చెప్పు నుంచి తల క్లిప్పు దాకా అన్నిటా తానే అనిపిస్తున్నదీ చల్లటి పండు… దాని రోజులు నడుస్తున్నాయి మరి!