ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని కరువు తరచుగా పలకరిస్తుంది. గత ముప్పయ్యేండ్లలో ప్రతి ఐదేండ్లకోసారి కరువు పలకరించడమే అక్కడి దుస్థితిని కండ్లకు కడుతుంది. ఎండాకాలంలో అయితే నీటి కొరతకు వడగాలులు తోడవుతాయి. ఇక రోజువారీ అవసరాల కోసం నెత్తిమీద, చంకల్లో బిందెలు పెట్టుకుని మైళ్లకొద్దీ దూరం నడిచే మహిళలు కనిపించడం ఇక్కడ సాధారణం. ఇక్కడివాళ్లకు నీళ్లు నిజంగానే బంగారం.
ఇలాంటి పరిస్థితి ముప్పయ్యేండ్ల రాంబాబు తివారికి బాల్యం నుంచి అనుభవమే. అందుకే పన్నెండో తరగతిలోనే తనవాళ్ల నీటి కష్టాలను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్నారు. అంత చిన్న వయసులోనే సొంతూరు అధావన్లో చెరువును నీటితో నింపడం ద్వారా తనవాళ్ల కష్టాలను తీర్చే దిశగా ప్రయత్నం మొదలుపెట్టాడు. రాంబాబుకు కుటుంబసభ్యులు, దోస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
అయినా కొంతమంది గ్రామస్తులను పోగుచేశాడు. నీటి సంరక్షణను దైవకార్యంగా భావించాలని నూరిపోశాడు. ఊరి చెరువు బాగు చేసుకునే దిశగా వారిని ఉత్సాహపరిచాడు. పనులు సాగుతుండగానే రాంబాబు 2012లో ప్రయాగరాజ్‌లో ఉన్నతవిద్యకు వెళ్లాడు. అక్కడ హాస్టల్లో తాను స్నానం చేసే నీళ్లతో తమ కుటుంబ రోజువారీ అవసరాలు తీరిపోతాయని గుర్తించాడు. పైగా ఊళ్లో కూడా పరిస్థితి మునుపటిలా మారిపోయింది.
విషయం తెలుసుకున్న రాంబాబు వారాంతాల్లో ఊరికి వచ్చి తన కార్యక్రమాన్ని కొనసాగించాడు. అలా పదకొండు బీగాల విస్తీర్ణం ఉన్న బజ్రంగ్సాగర్ చెరువును బాగుచేసుకున్నారు. 2015 రుతుపవనాల నాటికి ఫలితాలు కనిపించడం మొదలైంది. ఆ ఏడాది కురిసిన వానలకు బజ్రంగ్సాగర్ జలకళను సంతరించుకుంది. దీంతో రాంబాబు బృందంలో ఉత్సాహం పెరిగింది. చిన్నచిన్న నీటి నిల్వ నిర్మాణాలు చేపట్టారు. వాటిలో చేరుకున్న నీటిని వ్యవసాయ అవసరాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు 75 చెరువులను బాగుచేశారు.
అంతేకాదు… బుందేల్‌ఖండ్ గ్రామాల్లో నీటి వినియోగం, సంరక్షణ పద్ధతుల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాంబాబు తివారి ఇప్పుడు తన ప్రాంతంలో ‘జలయోధుడు’ (వాటర్ హీరో)గా ప్రసిద్ధుడు. తనవాళ్ల నుంచి వ్యతిరేకత వచ్చినా కార్య సాధకుడికి అది బలంగానే మారుతుంది. దీనికి రాంబాబు మంచి ఉదాహరణ. ఇప్పుడు జల సంరక్షణ ఆయన జీవితంలో విడదీయరాని భాగం. బుందేల్‌ఖండ్‌లో ఆయనకు ఐదువేల మంది నీటిమిత్రుల నెట్వర్క్ ఏర్పడింది. అందుకే “నేనెప్పటికీ ఉండను కదా! నేను లేకపోయినా నా ఆశయం కొనసాగాలి’ అని నవ్వుతూ చెబుతాడు రాంబాబు.