నీటి వినియోగంలో భారతదేశంలో ఒకప్పుడు మెట్లబావులు, ఆలయాల కోనేర్లు కీలకపాత్ర పోషించాయి. ఒక్క జలాధారాలుగా మాత్రమే కాకుండా ఇవి సమీప ఆవాసాలను చల్లబరచడం, వర్షపు నీటి నిల్వ విషయంలో, సామాజిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రముఖంగా నిలిచాయి. కాలక్రమంలో భారతీయ సాంస్కృతిక చిహ్నాలుగానూ గుర్తింపు పొందాయి. ఉత్తర భారతదేశంలో నిర్మించిన కొన్ని మెట్లబావులు మన ప్రాచీన కాలపు ఇంజినీరింగ్ నైపుణ్యాలకు, సుస్థిర అభివృద్ధి పరిష్కారాలకు అద్దంపడతాయి. ఈ క్రమంలో మనకు క్రీస్తు పూర్వం 2,500 సంవత్సరాల కిందటి సింధూ నాగరికత ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. మొహెంజోదారో, హరప్పా, లోథాల్, ధోలవీర తదితర సింధూ నాగరికత నగరాల ప్రజలు నీటి నిర్వహణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక క్రీస్తుశకం ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల్లో నిర్మించిందిగా భావిస్తున్న ‘చాంద్ బావ్రీ’ మెట్లబావి నిర్మాణపరంగా గొప్ప కట్టడం. ఇది బోర్లించిన పిరమిడ్‌ను పోలి 13 అంతస్తులు, అన్ని విధాలుగా సమాన కొలతలు కలిగిన 3,500 మెట్లతో కూడిన చూడ చక్కని నిర్మాణం. రాజస్థాన్‌లోని ఆభానేరిలో ఉన్న చాంద్ బావ్రీ నిర్మాణం కేవలం జలాశయంగా ఉపయోగపడటం మాత్రమే కాకుండా పరిసరాలు చల్లగా ఉంచేలా సాగడం విశేషం. ఇక క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందిన ‘రాణీ కీ వావ్’ వంద రూపాయల నోట్ల మీద దర్శనమిస్తుంది. ఇది గుజరాత్‌లోని పటన్‌లో ఉంది.
వివిధ హిందూ దేవతల విగ్రహాలతో నిర్మితమైన ఈ మెట్లబావికి 2014లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోనూ చోటు దక్కింది. అంతేకాదు రాణీ కీ వావ్‌లో ప్రాచీన భారతీయ శిల్పకళా నైపుణ్యం చూసేవారిని విస్మయపరుస్తుంది. దక్షిణ భారతదేశంలోనూ మదురై, కాంచీపురం సహా పెద్దపెద్ద ఆలయాలకు అనుబంధంగా భారీ కోనేర్లు దర్శనమిస్తాయి. ఇవి ఆలయాల అవసరాలకు మాత్రమే కాకుండా ఆయా ప్రదేశాల నీటి నిర్వహణలోనూ ముఖ్యపాత్ర పోషించాయి. ఒక్క నీటి నిల్వ విషయంలో మాత్రమే కాకుండా స్థానికంగా భూగర్భ జలం పెరగడంలోనూ తమవంతు దోహదం చేస్తున్నాయి. వీటిని రాజుల కాలంలో నిర్మించినా ఇప్పటికీ ప్రజలకు సేవలందిస్తున్నాయి.
అదీ పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండానే. ఎండకాలం వచ్చిందంటే సరి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా నీళ్ల కొరత ఎదురవుతుండటం మనం తరచుగా అనుభవించే దుస్థితే. ఈ సమస్య పరిష్కారానికి మెట్లబావులు, కోనేర్లు లాంటి సంప్రదాయ జల వనరులు మనకు స్ఫూర్తిగా నిలుస్తాయి.