ఆకాశపు అంచుల్ని చూసేలా గాల్లో రివ్వుమంటూ దూసుకుపోవడమూ, సంద్రపు లోతుల్ని తాకేలా నీళ్లలో రయ్యిరయ్యిన విహరించడమూ చాలా మందికి ఆనందోత్సాహాలనిచ్చే పనులు. అందుకోసం అటు విమానమెక్కినా, ఇటు ఓడనెక్కినా ఎన్నెన్నో అద్భుతమైన దృశ్యాలు కళ్ల ముందు నిలుస్తుంటాయి. ఆ అందమైన లోకాన్ని మనకి చూపించేది మాత్రం అక్కడి గవాక్షాలే.ఆ అనుభూతుల్ని అమితకాలం అలా నిలిపి ఉంచేలా వాటినే స్ఫూర్తిగా తీసుకొని హైపర్ రియలిస్టిక్ వాల్ డెకరేషన్ స్టిక్కర్లు రూపొందిస్తున్నారు. విమానం, జలాంతర్గామి, ఓడలలోని కిటికీల్లోంచి కనిపించే దృశ్యాలను మన ఇంటి గోడ మీద ఆవిష్కరిస్తాయివి.
ప్రయాణం చేసేప్పుడు కిటికీ పక్కన సీటుకి ఓ ప్రత్యేకత ఉంటుంది. అన్ని సీట్లు వేరు, విండో సీట్ వేరు. ప్రయాణాన్ని అనుభూతి చెందేందుకు అది ఓ ప్రత్యేకమైన తోడు. దోస్త్ పక్కన లేకపోతే మస్త్ చికాకు అనుకునేవాళ్లకి కూడా కాస్త మస్తీ అందిస్తుంది ఇది. ఆ సవారీ సరదా బస్సులు, రైళ్లలోనే కాదు గాలి మోటర్లో అయినా, నీటి బండిలో అయినా అంతే ఉంటుంది. తగ్గేదేలే అంటుంది. ముఖ్యంగా ఇలా నింగి అంచులకు దూసుకుపోయినప్పుడు, నీటి అడుగుల్లోకి ప్రవేశించినప్పుడు మన చుట్టూ మరో ప్రపంచమే దర్శనమిస్తుందా కిటికీ గుండా! ఆ సోయగాలు మనసును కట్టి పడేస్తాయి. వాటినలాగే పట్టి ఉంచుతూ, ఆ అనుభూతిని మళ్లీ మళ్లీ కలిగించేలా విభిన్నమైన విండో వాల్ స్టిక్కర్లను తయారు చేస్తున్నారు ఈ తరం డిజైనర్లు. ‘ఎయిరోప్లేన్ విండో హైపర్ రియలిస్టిక్ త్రీడీ వాల్ స్టిక్కర్’, ‘షిప్ విండో ఫ్రేమ్ స్టిక్కర్’, ‘సబ్ మెరైన్ విండో స్టిక్కర్’, ‘పోర్ట్‌హోల్ త్రీడీ స్టిక్కర్’లాంటి పేర్లతో ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. సీనరీలు ఇష్టపడుతూ, గదికి విభిన్నమైన లుక్ కావాలనుకునే వాళ్లకు ఇవి మంచి ఎంపిక.
అందంగా విభిన్నంగా…
ఇంటీరియర్ డిజైనింగ్‌లో వాల్ డెకార్స్ది ప్రత్యేక స్థానం. అవి గదికి అందంతో పాటు, మనసుకు ప్రత్యేక అనుభూతినీ కలగజేస్తే ఇంకెంత విశేషం. హాయిగా విమానంలో విండో పక్కన కూర్చుని హిమాలయాల మంచు సోయగాలను వీక్షిస్తుంటే, ఆ కిటికీ కళ్లలో నుంచే న్యూయార్క్ నగరపు వెలుగుల్ని ఆస్వాదిస్తే… ఎంత బాగుంటుందో కదూ! అంతేకాదు, పెద్ద ఓడలో విహరిస్తూ గుండ్రటి ఆ పోర్ట్‌హోల్ కిటికీల గుండా పగడపు దిబ్బల్ని, వింతైన సీ లయన్లనీ, సుదూర తీరాలనూ పరికిస్తుంటే ఆ అనుభవం ఇంకెంత ప్రత్యేకంగా ఉంటుంది. అలా ఈ దృశ్యాలన్నింటినీ కళ్లకు కట్టేలా కిటికీతో సహా మనముందుంచేవే ఈ కొత్తరకం స్టిక్కర్లు. వీటిని లివింగ్ రూమ్, గెస్ట్రూమ్, బెడ్రూమ్, హాలు.. ఇలా నచ్చిన చోట అతికించుకోవచ్చు. మూడు నాలుగు విండోలు పక్కపక్కన ఉన్నట్టుగా, ఆ మొత్తంలోంచి ఒక దృశ్యం కనిపించేలా రూపొందించిన వాటితో పాటు ఒకే కిటికీ ఉంటూ అందులోనే సీనరీ వచ్చే వాటి దాకా రకరకాలు వస్తున్నాయి. ఆన్లైన్ వెబ్సైట్లలో దొరుకుతున్న వీటిలో కస్టమైజేషన్ కూడా అందిస్తున్నాయి కొన్ని సంస్థలు. అంటే ఆ కిటికీలో ఏం కనిపించాలి అన్నది మనమే చెప్పొచ్చు. ఇక, విమానం ముందు భాగంలో పైలట్ కూర్చునే చోటు నుంచి బయటికి వ్యూ ఎలా ఉంటుందో చూపించే స్టిక్కర్లూ ‘కాక్‌పిట్ త్రీడీ వాల్ మ్యూరల్’ పేరిట అందుబాటులో ఉన్నాయి. మరి గది నుంచి మీ ప్రయాణమెటు… నీలాల నింగిలోకా, నిండైన సంద్రానికా!?