విభిన్నమైన భౌగోళిక ప్రాంతాలు, వాతావరణ మండలాలు, సంస్కృతులు, ఆహార విధానాలతో భారతదేశం వైవిధ్యభరితంగా ఉంటుంది. అసలు మన భూగ్రహానికి మన దేశం ఓ నఖలుగా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2025 ఏడాదిలో కొత్తగా మన భారతావనిని సందర్శించండి. మనదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. మార్చి చివరి నుంచి మే వరకు ఎండలు మండుతుంటాయి. కాబట్టి అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలం భారతదేశంలో ఏ ప్రాంతాన్ని సందర్శించడానికైనా అత్యుత్తమమైన సమయం. హిమాలయాల్లో వేసవి విడుదులను సందర్శించడానికి ఏప్రిల్ నుంచి జూన్ నెల తొలివారం వరకు మంచి సమయం.
ఈ రెండు ప్రాంతాలను ప్లాన్ చేసుకుంటే పండర్‌పుర్, తుల్జాపుర్, షిర్డీ, నాసిక్ లాంటి పుణ్యక్షేత్రాలతోపాటు మహారాష్ర్టుల కోటలు, అరేబియా సముద్రం అందాలు, గోవాలో పోర్చుగీసుల సాంస్కృతిక ఆనవాళ్లు, బొంబాయిలో బ్రిటిష్ కాలపు నిర్మాణాలను చూడొచ్చు.
ఢిల్లీ, రాజస్థాన్ రాష్ర్టాలను కలిపి ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకేసారి దేశ రాజధానితోపాటు, రాజస్థాన్‌లోని కోటలు, ఆగ్రాలోని తాజ్‌మహల్, మథుర, బృందావనంలో కృష్ణ పరమాత్ముడి మధురస్మృతులను నింపుకొని రావచ్చు.
సోమనాథ్ జ్యోతిర్లింగం, ద్వారక శ్రీకృష్ణ మందిరం, మహాత్మాగాంధీ పుట్టిన పోర్బందర్తోపాటు రాజధాని గాంధీనగర్, అహ్మద్‌నగర్, కచ్ ఉప్పు నేలలు, గిర్ సింహాల అడవి దర్శనీయ ప్రదేశాలు.
బెంగళూరు, మైసూరు నగరాలు, కావేరీ నదితోపాటు కేరళలో పశ్చిమ కనుమల అందాలు, అరేబియా సముద్ర బీచ్‌లు, అనంతపద్మనాభ స్వామి దేవాలయం తదితరాలు, సముద్రపు కాల్వల్లో పడవ ప్రయాణాలు జీవితకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
మిగిలిన దేశానికి భిన్నంగా తమిళనాడులో అక్టోబర్ డిసెంబర్ మధ్యలో వర్షాలు, తుపానులు వస్తాయి. మిగిలిన సమయంలో ఎప్పుడైనా ఈ రాష్ర్టాన్ని చుట్టేసిరావచ్చు. మహాబలిపురం, కంచి, తంజావూరు, మదురై, కన్యాకుమారి, ఊటీ ఇక్కడి ప్రసిద్ధ స్థలాలు.
అయోధ్య, ప్రయాగ త్రివేణి సంగమం, కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తీర్థయాత్ర స్థలాలు. బిహార్‌లో బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన గయ, ఆయన జీవితంతో ముడిపడిన రాజ్‌గిర్, నలంద తదితర ప్రదేశాలు దర్శనీయాలు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్ దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. దగ్గర్లోనే పూరీ జగన్నాథ దేవాలయం, కోణార్క్ సూర్యదేవాలయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. బెంగాల్లో రాజధాని కోల్‌కతా నగరంతోపాటు శాంతినికేతన్, డార్జిలింగ్ చూడదగ్గ ప్రదేశాలు. హిమాలయాల ఒడిలో
ఒదిగిపోయిన సిక్కిం రాష్ట్రం డార్జిలింగ్‌కు దగ్గరే.
అసోంతో కలుపుకొని ఏడు రాష్ర్టాలు భాగంగా ఉండే ఈశాన్య దేశంలో కామాఖ్య దేవాలయం, బ్రహ్మపుత్ర నదిలో మజూలీ ద్వీపం, అరుణాచల్‌లో తవాంగ్‌లోయ మొదలైనవి చూడదగ్గ ప్రదేశాలు.
ఢిల్లీతోపాటు చూడాలనుకుంటే పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, కశ్మీర్, లఢఖ్ ప్రాంతాలను కూడా పర్యాటక జాబితాలో చేర్చుకోవచ్చు. కేదార్నాథ్, బదరీనాథ్, గంగోత్రి, హరిద్వార్ తదితర ప్రదేశాలతో అలరారే దేవభూమి ఉత్తరాఖండ్ కూడా ఢిల్లీ ద్వారా వెళ్లగలిగే పర్యాటకుల స్వర్గధామమే.